ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపడమే ఎజెండా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం/కూసుమంచి, వెలుగు: జెండా ఏదైనా ఎజెండా ఒకటేనని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఓడగొట్టడమే లక్ష్యమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలాయపాలెంలో పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘మాటలతో హిప్నాటిజం, కల్లబొల్లి కబుర్లు చెప్పడంలో ఈ సీఎం దిట్ట. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని రెండుసార్లు మాయమాటలు నమ్మి టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. ధనిక రాష్ట్రం కాస్తా అప్పులపాలైంది. ఎనిమిదేళ్లలో రూ.4.86 లక్షల కోట్ల అప్పులు చేశారు. అనేక వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారో మీకే తెలుసు’ అంటూ పొంగులేటి విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చారని, రూ.లక్ష రుణమాఫీ కోసం మొత్తం 36 లక్షల రైతులు ఎదురుచూస్తుంటే కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. యువత ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తెచ్చారన్నారు. 

ఉప ఎన్నికలు వచ్చినచోటల్లా దళిత బంధు, గిరిజన బంధు, నిరుద్యోగ భృతి అంటూ వల్లెవేస్తారని, అమలులో చిత్తశుద్ధి ఏదని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో 20 డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు కట్టించిన గ్రామం ఒక్కటైనా ఉందా అని నిలదీశారు. ఆత్మీయ సమ్మేళనానికి ప్రజాప్రతినిధులు రాకుండా అడ్డుకున్నారని, రెండేళ్లుగా బిల్లులు పెండింగ్ ఉండడంతో అవి ఆగిపోతాయన్నా భయంతో రాలేదని చెప్పారు. తనకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా నమ్ముకున్న వారికి అండగా ఉంటానని అన్నారు. సమావేశంలో నేతలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, రామసహాయం నరేశ్​రెడ్డి, చావా శివ రామకృష్ణ, డాక్టర్ కోట రాంబాబు, విజయ బాయి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నెల్లూరి భద్రయ్య, 
బజ్జూరి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.