ఫారిన్​లో ఎంబీబీఎస్ పేరిట పేరెంట్స్​కు ఎర

ఫారిన్​లో ఎంబీబీఎస్ పేరిట పేరెంట్స్​కు ఎర
  • బురిడీ కొట్టిస్తున్న కన్సల్టెన్సీలు
  • మీడియా, సోషల్​ మీడియాలో ప్రచార హోరు
  • స్టూడెంట్లకు నాసిరకం కాలేజీల్లో సీట్లు అంటగడుతున్న వైనం
  • విదేశాల్లో చదివొచ్చి డాక్టర్లు అయ్యేది 20 శాతం మందే

హైదరాబాద్, వెలుగు: నీట్ రిజల్ట్ వచ్చిరాగానే తక్కువ మార్కులతో క్వాలిఫై అయిన స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల చుట్టూ మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని ఏజెంట్లు తల్లిదండ్రులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ మెయిన్​ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ ఏజెన్సీల మాయలో పడి ఏటా మన రాష్ట్రం నుంచి వేల మంది స్టూడెంట్లు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివేందుకు వెళ్తున్నారు.

 కానీ, ఇందులో సగానికిపైగా విద్యార్థులు అండర్‌ ‌గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు. ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నా.. ఇక్కడికొచ్చాక నేషనల్ బోర్డు నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్‌ ఎగ్జామ్‌ (ఎఫ్​ఎంజీఈ) పాస్ కాలేకపోతున్నారు. ఈ ఎగ్జామ్ పాస్ కాకుంటే, విదేశాల నుంచి తెచ్చుకున్న ఎంబీబీఎస్ పట్టా పనికిరాదు. ఆ పట్టాతో ఇక్కడ డాక్టర్‌‌గా ప్రాక్టీస్ చేయడానికి వీలు ఉండదు. 

చివరి ఐదు ఎఫ్‌ఎంజీ ఎగ్జామ్స్‌లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజ్‌ 25 దాటలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చిన వేల మంది అటు డాక్టర్లు కాకపోగా, ఇటు ఇంకే వృత్తికీ నోచుకోక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. చాలా దేశాల్లో మెడికల్ విద్య ఒక వ్యాపారంగా మారిపోవడమే ఇందుకు కారణమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. తమ పిల్లల్ని విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివించదల్చుకున్న తల్లిదండ్రులు, ఏజెంట్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని సూచిస్తున్నారు.

ఎఫ్‌ఎంజీఈ మస్ట్‌

విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చాక  ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్‌ఎంజీఈ) రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌ పాస్ అవకుండా డాక్టర్‌‌గా ఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్​ పొందలేరు. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌, అమెరికా దేశాల్లో చదివిన విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈ రాయనవసరంలేదు. ఆ దేశాల్లో వైద్య విద్య ప్రమాణాలు ఇండియాలో కంటే బాగుంటాయని, అక్కడి చదివినోళ్లకు ఈ పరీక్ష నుంచి మినహాయింపునిచ్చారు.

 మిగతా ఏ దేశంలో చదివినా ఎఫ్‌ఎంజీఈ పాస్‌ కావాల్సిందే. ఈ ఎగ్జామ్​ పాస్‌ అయ్యాక ఇండియాలోనే ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తి చేస్తేనే డాక్టర్‌‌గా ఎన్‌ఎంసీ పూర్తిస్థాయి గుర్తింపునిస్తుంది. ఈ గుర్తింపు లేకుండా డాక్టర్‌‌గా ప్రాక్టీస్ చేసేందుకు మన దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా పర్మిషన్ ఇవ్వరు. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ఇవ్వరు. ఇవేవీ లేకుండా ప్రాక్టీస్ చేస్తే, దొంగ డాక్టర్‌‌ కిందే లెక్కగట్టి కేసులు పెడతారు.

ఈ ఎగ్జామ్​ చాలా టఫ్

నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జాబినేషన్స్‌(ఎన్‌బీఈ) ఏటా జూన్, డిసెంబర్‌‌లో ఎఫ్‌ఎంజీఈని నిర్వహిస్తుంది. 300 మార్కులకు నిర్వహించే ఈ ఎగ్జామ్‌లో  కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకుంటే పాస్ అయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. కానీ, చాలా మంది ఈ ఎగ్జామ్‌ పాస్ కాలేక తిప్పలు పడుతున్నారు. 2019 నుంచి పాస్‌ పర్సంటేజ్ 10 నుంచి 25 మధ్య ఉంటుండగా, 75 నుంచి 90 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. 

ఈ ఎగ్జామ్‌ ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక, వందల మంది తమ చదువును మధ్యలోనే వదిలేస్తున్నారు. కొంత మంది  ప్రైవేట్​, కార్పొరేట్‌ హాస్పిటల్స్​లో అత్తెసరు జీతానికి క్లినికల్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇది కూడా దొంగచాటు ఉద్యోగమే. దొరికితే హాస్పిటల్‌కు, ఆయా వ్యక్తులకు జైలుశిక్ష తప్పదు. కొంతమంది దొంగ సర్టిఫికెట్లు సృష్టించి, డాక్టర్లుగా చలామణి అవుతుండగా.. కొంత మంది ఆర్‌‌ఎంపీ, పీఎంపీలుగా మిగిలిపోతున్నారు. ఈ ఎగ్జామ్‌ కోసం లక్షలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నావాళ్లూ ఉన్నారు.

డాక్టర్లకు తగ్గిన గిరాకీ

మన దేశంలో డాక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఐదేండ్లలో దేశంలో మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య రెండింతలకుపైగా పెరిగింది. మన రాష్ట్రంలోనే చూసుకుంటే ఏకంగా 8,515 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, ఈ ఏడాది మరో 800 సీట్లు పెరుగనున్నాయి. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో జిల్లాల్లోనూ డాక్టర్లు అందుబాటులోకి వచ్చారు. 

జనాలు కూడా స్పెషలిస్ట్ డాక్టర్లనే ఎంచుకుని వారి వద్దే ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. రాబోయే ఐదేండ్లలో డాక్టర్ల సంఖ్య ఇంకా పెరుగుతుందని, అప్పుడు ప్రాక్టీస్ తగ్గిపోయే అవకాశం ఉందని, విదేశాల్లో అరకొర చదువులు చదివితే మంచి డాక్టర్లు కాలేరని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎంబీబీఎస్ చదవాలనుంటే కష్టపడి నీట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకుని, లోకల్‌గా మంచి కాలేజీల్లో చదవాలని సూచిస్తున్నారు.