ముంబై: మాక్రో ఎకనమిక్ డేటా బాగుండటం, విదేశీ మార్కెట్ల బుల్లిష్ ట్రెండ్ కారణంగా ఇండెక్స్‌ల దూకుడు కొనసాగింది. వరుసగా నాలుగో రోజైన మంగళవారం ఇవి తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రూపాయి కోలుకోవడంతోపాటు, విదేశీ నిధుల ప్రవాహం ఊపందుకోవడం కలిసివచ్చింది. దీంతో 30 షేర్ల బీఎస్‌ఈసెన్సెక్స్ 374.76 పాయింట్లు లేదా 0.62 శాతం పెరిగి 61,121.35 వద్ద స్థిరపడింది. ఇది- ఈ ఏడాది జనవరి 17 తర్వాత తొలిసారిగా 61,000 స్థాయికి ఎగువన ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 133.20 పాయింట్లు లేదా 0.74 శాతం పురోగమించి 18,145.40 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ అత్యధికంగా 5 శాతం లాభపడగా, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాటా స్టీల్.. ఈ నాలుగు స్టాక్స్ మాత్రమే 3.76 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ గేజ్ 1.04 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.26 శాతం ఎగబాకాయి. దాదాపు అన్ని బీఎస్‌ఈ సెక్టోరల్ ఇండెక్స్‌లు 2.18 శాతం వరకు పెరిగాయి. యుటిలిటీస్ (2.11 శాతం), ఐటీ (1.77 శాతం), టెక్ (1.67 శాతం), హెల్త్‌కేర్ (1.61 శాతం) కమోడిటీస్ (1.45 శాతం) పెరిగాయి. బ్యాంకెక్స్ మాత్రమే వెనుకబడింది. ఆసియాలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మిడ్ సెషన్ డీల్స్‌లో యూరప్‌లోని స్టాక్ ఎక్స్ఛేంజీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ సోమవారం నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.45 శాతం పెరిగి 94.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మంగళవారం డాలర్‌తో రూపాయి విలువ10 పైసలు పెరిగి 82.71 (తాత్కాలిక) వద్ద ముగిసింది. ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) సోమవారం రూ. 4,178.61 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.