
- చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న మోకిల పోలీసులు
చేవెళ్ల, వెలుగు: అఘోరి అలియాస్ శివవిష్ణుబ్రహ్మ అల్లూరి అలియాస్ శ్రీనివాస్ ను మోకిల పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూజల పేరుతో ఓ మహిళను మోసగించిన అతనిపై మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.
అయితే మోకిల పోలీసులు ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు రెవెన్యూలోని ప్రగతి రిసార్టులో నివసిస్తున్న వినితా భాటీ అనే మహిళ ఓ పుణ్యక్షేత్రం వద్ద పూజలు నిర్వహించేందుకు అఘోరిని సంప్రదించింది. ఇందుకు రూ.9.80 లక్షలు కావాలని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించిన తర్వాత మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో వినితా ఫిబ్రవరిలో మోకిల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు దర్యాప్తులో ఉండగానే... అఘోరి ఏపీకి చెందిన వర్షిణిని ప్రేమ పేరుతో తన వెంట యూపీకి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు వర్షిణిని తిరిగి ఇంటికి తీసుకొచ్చినా.. కొన్నాళ్లకే అఘోరీ, వర్షిణి కేధార్ నాథ్ వెళ్లి పెండ్లి చేసుకున్నారు. దీంతో వారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడంతో తాము తెలుగు రాష్ట్రాలకు రాబోమని ప్రకటించారు. తమను అరెస్టు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని వారం కింద వీడియో రిలీజ్ చేశారు. అయితే.. అఘోరీపై చీటింగ్ కేసు ఉండడంతో మోకిల పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.