సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి మల్లన్న గుడిలో అఘోరి నాగసాధువు నానా రచ్చ చేసింది. కత్తితో పలువురిపై దాడి చేస్తూ భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టింది. బట్టలు వేసుకొని దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించారు. భక్తులు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీంతో.. ఆమె భక్తులపై తన వెంట తెచ్చుకున్న ఖడ్గంతో దాడి చేసింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కొంతసేపటి తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అప్పుడు అఘోరి నాగసాధువు దుస్తులు ధరించి దర్శనానికి వెళ్లేందుకు ఒప్పుకుంది. ఆలయ అధికారులు, పోలీసులు స్వామివారి దర్శనం చేయించడంతో దర్శనం అనంతరం అఘోరి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసి శాంతి హోమం, చండీ హోమం, పూర్ణాహుతి జరుగుతున్న సమయంలో అఘోరి నాగసాధు అక్కడికి వెళ్లింది. భక్తులు అందరూ ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు అమ్మవారే వచ్చిందని భక్తులు నమ్మారు. ఆలయానికి వెళ్లిన అఘోరీ హోమంలో పాల్గొని, ఒంటి కాలుపై నిలబడి పూజలు చేశారు.
ALSO READ | వరల్డ్ ఫేమస్ చెట్లతో ఎకో పార్క్ ఆకట్టుకుంటోంది : సినీ నటుడు చిరంజీవి
నాగ సాధు అఘోరి గురించి తెలిసే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నాగ సాధు అఘోరి ఆలయాల సందర్శనకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఆలయాలకు నాగ సాధు అఘోరి వెళ్లడం, వస్త్రాలు లేకుండా అనుమతించేది లేదని ఆలయ సిబ్బంది తేల్చి చెప్పడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో కూడా అప్పట్లో ఇదే జరిగింది.
వరంగల్ భద్రకాళి ఆలయానికి నాగ సాధు అఘోరి వెళ్లింది. ఆలయం వద్ద అఘోరిని దేవాలయ సిబ్బంది అడ్డుకున్నారు. వస్త్రాలు లేకుండా అనుమతించేది లేదని ఆలయ సిబ్బంది తేల్చి చెప్పారు. అఘోరిని చీర కట్టుకొని లోపలికి రావాలని భక్తులు కూడా కోరారు. దీంతో.. భక్తుల కోరిక మేరకు చీర కట్టుకొని అమ్మవారి దర్శనానికి ఆలయంలోకి నాగ సాధు అఘోరి వెళ్లింది.