- ఏండ్లుగా బోథ్, ఖానాపూర్, చెన్నూర్ వాసుల ఎదురుచూపు
- గతంలో రెండు నెలలపాటు ఆందోళన చేసిన బోథ్ వాసులు
- తాజాగా అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు బొజ్జు, అనిల్ జాదవ్
- సాధ్యసాధ్యాలు పరిశీలిస్తామన్న మంత్రి పొంగులేటి
- చెన్నూర్ డివిజన్పైనా ప్రజల ఆశలు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా బోథ్, ఖానాపూర్ డివిజన్ కోసం ఆ ప్రాంత ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో డివిజన్ ఏర్పాటు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారే తప్ప గెలిచిన తర్వాత ఆ అంశంపై ఊసే ఎత్తడం లేదు. ఫలితంగా ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడంతో వారు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు డివిజన్ల ఏర్పాటుపై హామీలు ఇచ్చి ప్రచారం చేసుకున్నప్పటికీ.. పదేండ్లగా పెండింగ్ లోనే ఉంచారు. తాజాగా మరోసారి డివిజన్ల అంశం తెరపైకి వచ్చింది. బోథ్ ను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఖానాపూర్ డివిజన్ కోసం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మూడ్రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో ప్రస్థావించారు.
Also Read :- కాపలా కుక్కలే వేట కుక్కలైనయ్
దీంతో డివిజన్లపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, మంత్రి సీతక్కకు సైతం పలుమార్లు విన్నవించినట్లు అనిల్ జాదవ్ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. అటు ఖానాపూర్ ఎమ్మెల్యే సైతం డివిజన్ ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాల్సిన సమయం వచ్చిందని ఉద్ఘాటించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టి సారించాలని కోరారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. డివిజన్లు ఏర్పాటు చేయడంలో ఎలాంటి బేషాజాలం చూపమని చెప్పడంతో ప్రజల్లో ఆశలు మొలకెత్తాయి.
ఏళ్లుగా బోథ్ ప్రజల ఆందోళనలు
బోథ్ నియోజకవర్గం దాదాపు 130 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మండల కేంద్రం నుంచి ఆదిలాబాద్ కు వెళ్లాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఉట్నూర్ డీఏస్పీ కార్యాలయానికి వెళ్లాలన్నా 80 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. దీంతో బోథ్ ను డివిజన్ చేయాలని ఎన్నో ఏండ్లుగా ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. డివిజన్ సాధన సమితి ఏర్పాటు చేసి గతేడాది 3 నెలల పాటు రిలే దీక్షలు చేపట్టారు. రోజుకో రీతిలో నిరసనలు తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను కాంగ్రెస్ నేతలు పలు మార్లు కలిసి విన్నవిం చారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారు. డివిజన్‌పై ఎమ్మెల్యే అనిల్ జాదవ్తాజాగా అసెంబ్లీలో గళం విప్పారు.
చెన్నూర్ డివిజన్‌పై హామీ ఇచ్చి మరిచిన కేసీఆర్
చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రస్తుతం ఏ అవసరం వచ్చినా 40 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల డివిజన్‌కు వెళ్లాల్సి వస్తోంది. చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేస్తే చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాలతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి, నెన్నెల మండల వాసులకు సౌకర్యంగా ఉంటుంది. 2019 ఏప్రిల్‌లో గోదావరిఖనిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా చేస్తానని ప్రకటించారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. చెన్నూరు మండలం అస్నాద్‌ను, కోటపల్లి మండలంలోని పారిపెల్లి ని మండలాలుగా చేస్తానని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హామీ ఇచ్చినా నెరవేర్చలేదు.
పదేండ్లుగా ఎదురుచూస్తున్న ఖానాపూర్ వాసులు
ఎస్టీ నియోజకవర్గమైన ఖానాపూర్ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ప్రజలు పదేండ్లుగా కోరుతున్నారు. ప్రస్తుతం ఖానాపూర్ నిర్మల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. ఖానాపూర్ చుట్టుపక్కల మండలాలు కడెం, పెంబి, దస్తురాబాద్ ప్రజలు పనుల కోసం నిర్మల్ డివిజన్ కేంద్రానికి వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ నేపథ్యంలో డివిజన్ ఏర్పాటు డిమాండ్ ఊపందుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ ఖానాపూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారు. బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ డివిజన్‌గా మారకపోవడంతో కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై ఇటీవలే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసెంబ్లీలో ప్రస్తావించారు.