ఖమ్మం, వెలుగు: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలనే డిమాండ్ తో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ముందు సీపీఎం, సీపీఐ అనుబంధ రైతు సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. దీంతో కలెక్టరేట్ దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ లో వివిధ శాఖలపై రివ్యూ ముగించుకొని బయటకు వస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెహికల్‌ను వారు అడ్డుకున్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ నిబంధనలు విధించి రైతుల సంఖ్య కుదించడం సరి కాదని, షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తాం
కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సమయంలో కలెక్టరేట్‌లో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడికి వచ్చి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పదేండ్లలో రుణమాఫీ సక్రమంగా అమలు కాలేదని, రుణమాఫీలో జరిగిన తప్పులను కాగ్ కూడా తప్పుపడుతూ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు నేటి నుంచే రైతుల ఇంటి వద్దకు వచ్చి యాప్‌లో రిపోర్ట్ చేస్తారని, రూ.2 లక్షలకు పైగా అప్పు ఉన్న రైతుల సమస్య తీర్చేందుకు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు రూ.2 లక్షల వరకు అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.