బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో భద్రాచలంలో ఆందోళన

భద్రాచలం, వెలుగు : బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో గొత్తికోయలు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. 50 ఏండ్లుగా తెలంగాణలో ఉంటున్న  తమకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు, సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రభుత్వ పథకాలు అందించాలని డిమాండ్​చేశారు. ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ సీనియర్​ లీడర్​ బైరెడ్డి ప్రభాకర్​రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకూరి సతీశ్​కుమార్, భద్రాచలం అసెంబ్లీ కన్వీనర్​ గొలకోటి త్రినాథరావు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గొత్తికోయలు భద్రాచలంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సంప్రదాయ విల్లంబులతో నినాదాలు చేశారు.

వీరి ఆందోళనపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. గేట్లకు తాళం వేసి ఐటీడీఏలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ గిరిజన మోర్చా లీడర్లు, గొత్తికోయలు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ చత్తీస్​గఢ్​కు చెందిన ఆదివాసీలు 50 ఏండ్ల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వలస వచ్చి  ఇక్కడే బతుకుతున్నారని, వారికి ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఆధార్, రేషన్​ కార్డులున్నాయని, ఎన్నికల్లో ఓట్లు కూడా వేస్తున్నారని, అలాంటి వారికి సర్టిఫికెట్ల విషయంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వారు విద్యా,ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. తర్వాత ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రుకు వినతిపత్రం ఇచ్చారు.