ములుగు, వెలుగు: దుర్గమ్మ ఆలయంలోకి తమను రానివ్వలేదని దళితులు గ్రామస్తులపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసి మర్కుక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం శివారు వెంకటాపురం గ్రామంలో రెండు రోజుల కింద బోనాలు సమర్పించేందుకు దళితులు దుర్గమ్మ ఆలయానికి వచ్చారు. వారిని ఆలయంలోకి రానీయకుండా కొందరు బీసీ కులస్తులు అడ్డుకున్నారు. దుర్గమ్మకు దళితులు బోనం చేయొద్దని చెప్పడంతో, గ్రామంలో జరిగిన బోనాలకు దళితులు డప్పులు కొట్టలేదు.
దీంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సమస్య తీవ్రం కాకుండా సంప్రదింపులు జరపగా, ఫలించక పోవడంతో దళిత సంఘాల నేతలతో కలసి కంప్లైంట్ చేశారు. గ్రామానికి చెందిన గుల్లపల్లి కిషన్ గౌడ్, బచ్చాల సతీశ్, కర్రెపూట సత్తయ్య, తుమ్మల సత్యనారాయణ, శేరి వెంకటయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. దళిత సంఘాల నాయకులు శంకర్, మరాఠి కృష్ణమూర్తి, నర్సింలు, రాఘవ, శేఖర్, మల్లేశ్‌తో కలసి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.