![భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!](https://static.v6velugu.com/uploads/2023/05/farmers-affected-by-Nimz-under-Zaheerabad_AHXcGinEF4.jpg)
- భూములు అమ్మనియ్యరు..తాకట్టు పెట్టనియ్యరు..!
- జహీరాబాద్ పరిధిలోని నిమ్జ్ బాధిత రైతుల ఆవేదన
- నిషేధిత జాబితాలో18 గ్రామాల భూములు
- పెండ్లిళ్లకు, చదువులకు అమ్ముకోనివ్వకుండా చేశారని ఆగ్రహం
- గిట్టుబాటు ధర ఇస్తే ఇవ్వడానికి సిద్ధమంటున్న మెజారిటీ రైతులు
- తొమ్మిదేండ్లుగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
సంగారెడ్డి, వెలుగు : ‘సర్కారోళ్లు మా భూములు మాకు కాకుండా చేస్తున్నరు. నిమ్జ్ఏర్పాటు ఎప్పుడైతదో ఏమో గానీ అవసరానికి ఉన్న భూములు అమ్మనిస్తలేరు. కనీసం తాకట్టు కూడా పెట్టకుండా జేసిన్రు’ అంటూ జహీరాబాద్ నిమ్జ్ పరిధిలోని 18 గ్రామాలకు చెందిన బాధితులు ఆవేదన చెందుతున్నారు. తొమ్మిదేండ్లుగా తమ ఇబ్బందులను సర్కారు పట్టించుకోకపోవడంతో ఆందోళనలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో 65వ నేషనల్ హైవేను ఆనుకొని జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు 2015లో శ్రీకారం చుట్టింది. రెండు మండలాల్లోని 18 గ్రామాల పరిధిలో దాదాపు 500 ఫ్యాక్టరీల కోసం12,600 ఎకరాలు సేకరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహకారంగా భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్ర సర్కారు 2016 వరకు కేవలం 3,150 ఎకరాలు మాత్రమే సేకరించి తర్వాత ఆపేసింది.
అయితే, నిమ్జ్పరిధిలోకి వచ్చే భూములన్నింటిని 2015లో నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పోరాటంతో 2020లో నిషేధం నుంచి తొలగించినా 2021లో మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో ఆడపిల్లల పెండ్లిళ్లకు, వైద్య ఖర్చులకు, పిల్లల చదువులకు భూములు అమ్ముకుందామంటే వీలుకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులంతా తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని తహసీల్దార్ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు.
భూసేకరణే కాలే..ఎక్స్టెన్షన్కు లెటర్
2015 నుంచి ఏడేండ్లలోపు అంటే 2022 నాటికి ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలి. కానీ, తొమ్మిదేండ్లుగా కేవలం రాష్ట్ర సర్కారు భూసేకరణ వరకే పరిమితమైంది. పూర్తి భూమి సేకరించి ఇతర మౌలిక వసతులు సమకూర్చాల్సి ఉండగా, ఆ పని చేయలేదు. మరోవైపు ప్రాజెక్టు ఎక్స్ టెన్షన్ కోసం సెంట్రల్గవర్నమెంట్కు లెటర్ రాసినట్టు తెలిసింది. మొదటి దశలో భూ సేకరణకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించకుండానే రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతకు పోవడంపై స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నేషనల్ హైవే నుంచి నిమ్జ్వరకు వంద అడుగుల రోడ్డు పనులకు టీఎస్ఐఐసీ ద్వారా సర్వే చేయించడం, రెండో విడత భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం, అమెరికాకు చెందిన కార్ల కంపెనీతో పెట్టుబడులు పెట్టించేందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం వంటి పరిణామాలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి.
ధరలు పెరగడంతో..
నిమ్జ్ ఏర్పాటవుతోందన్న వార్తలతో రెండు మండలాల్లోని భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. అంతకుముందున్న ధరల కంటే అయిదారు రేట్లు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం చెప్పిన 12, 635 ఎకరాలు సేకరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఎకరాకు రూ.15 లక్షల పరిహారం ఇస్తామని చెబుతున్నా రైతులు అంగీకరించడం లేదు. దీంతో 18 గ్రామాల పరిధిలో కేవలం 3,150 ఎకరాలు మాత్రమే సేకరించగలిగింది.