వాళ్లను కాల్చేయండి.. లేదా.. నన్నైనా షూట్ చేయండి.. గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆవేదన

వాళ్లను కాల్చేయండి.. లేదా.. నన్నైనా షూట్ చేయండి.. గ్యాంగ్ రేప్ బాధితురాలి ఆవేదన

ఇండోర్: మధ్యప్రదేశ్‎లో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లపై దాడి, యువతిపై గ్యాంగ్ రేప్​ ఘటనలో నిందితులను షూట్​చేయాలని లేదంటే తనను షూట్ చేసి చంపేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని మోవ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనపై ఆర్మీ ఆఫీసర్ ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేట్​మెంట్ రికార్డు చేసుకునేందుకు శుక్రవారం ఆస్పత్రిలో ఉన్న బాధితురాలి వద్దకు వెళ్లగా ఆమె నిరాకరించినట్టు పోలీసులు తెలిపారు.

 ‘‘ఆమె మాకు ఒకే ఒక్క విషయం చెప్తున్నారు. నిందితులను షూట్​చేయండి.. లేదంటే నన్ను కాల్చేయండి అని అంటున్నారు. ఆమె బాగా షాక్‎లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదో పెద్ద తప్పు జరిగిందని అనుమానం కలుగుతున్నది. నిందితులు ఆమెతో చాలా దారుణంగా లేదా అనుచితంగా ప్రవర్తించి ఉంటారు” అని ఎంక్వైరీ ఆఫీసర్ ఒకరు మీడియాకు తెలిపారు. 

ప్రస్తుతం ఆమె స్టేట్​మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేదని.. ఆమె కోలుకున్న తర్వాత వాంగ్మూలం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అనిల్, పవన్, రితేశ్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. అయితే హత్య, దోపిడీలు సహా పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని చెప్పారు. మిగతా ఐదుగురిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్​నంబర్ ప్లేట్ లేని బైక్‎లపై తిరుగుతూ నేరాలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నామని, ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తామని పోలీసులు చెప్పారు.