సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రీతి కుటుంబానికి రూ. 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులకు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ వచ్చే వరకూ ప్రీతి మృతదేహాన్ని నిమ్స్ నుంచి కదిలించి లేదంటూ నినాదాలు చేస్తున్నారు. హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు.
మరోవైపు ప్రీతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఆస్పత్రి వర్గాలు, అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అటు ప్రీతి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయకుండా ప్రీతి మృతదేహాన్ని తీసుకునేది లేదని వారు స్పష్టం చేశారు. నిందితుడు సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రీతి హత్యకు కుట్ర జరిగిందని ఆమె తండ్రి ఆరోపించారు. తనపై కూడా ఒత్తిడి తెస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు