ఆర్జీయూకేటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

ఆర్జీయూకేటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన

బాసర, వెలుగు: నిర్మల్​జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎగ్జామ్ వాల్యుయేషన్‏లో వర్సిటీ అధికారులు తప్పులు చేసినట్టు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. గతంలోనూ కావాలనే రెండో సెమిస్టర్‎లో ఫెయిల్ చేశారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. వర్సిటీలో వాల్యుయేషన్ సరిగా చేయడంలేదని మండిపడ్డారు. వర్సిటీలో సెమిస్టర్ 2 పరీక్షలు ఇటీవల ముగిశాయి. తాజాగా ఫలితాలు వెల్లడించారు. ఇందులో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 

అనుమానం వచ్చిన కొందరు స్టూడెంట్స్ రీవాల్యుయేషన్‎కు దరఖాస్తు చేసుకోగా ఉత్తీర్ణత సాధించారు. దీంతో తప్పుడు వాల్యుయేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే.. కొన్ని సబ్జెక్టుల్లోని బ్యాక్ లాగ్స్ ఉన్నాయని అధికారులు చెప్పడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెమిస్టర్ పరీక్షల వాల్యుయేషన్‏లో అధికారుల తప్పిదాలతో విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

 వర్సిటీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని కోరారు. వాల్యుయేషన్‎లో తప్పులు దొర్లాయని విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై వర్సిటీ వీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏవో రణధీర్ సాఘి తెలిపారు. వీసీ నిర్ణయం మేరకు కమిటీ వేసినట్లు, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.