Ranji Trophy 2024-25: బ్రాడ్‌మాన్‌ను మించిపోయిన భారత క్రికెటర్

Ranji Trophy 2024-25: బ్రాడ్‌మాన్‌ను మించిపోయిన భారత క్రికెటర్

అగ్ని చోప్రా.. ఈ పేరు క్రికెట్ ప్రేమికులకు సైతం తెలియని పేరు. మిజోరాంకు చెందిన ఈ కుర్రాడు 10 టెస్టులాడకుండానే బ్యాటింగ్ లో ఏకంగా ఆస్ట్రేలియా ఆల్ టైం దిగ్గజ బ్యాటర్ బ్రాడ్ మాన్ ను దాటేశాడు. 17 ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 102 యావరేజ్ తో 1537 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్ లోనూ డబుల్ సెంచరీ చేసి ఈ ఘనతను అందుకున్నాడు. 17 ఇన్నింగ్స్ ల్లో 8 సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.   

మిజోరామ్ తరపున ఆడుతున్న చోప్రా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 269 బంతుల్లో 218 పరుగులు చేశాడు. అంతకముందు అహ్మదాబాద్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో చోప్రా  తొలి ఇన్నింగ్స్ లో 110.. రెండో ఇన్నింగ్స్ లో అజేయంగా 238 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మిజోరం 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

మొదటి నాలుగు రంజీ మ్యాచ్ ల్లో చోప్రా గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. రంజీ ట్రోఫీలో 105, 101, 114, 10, 164, 15, 166, 92 పరుగులు చేశాడు. దీనితో ఈ 26 ఏళ్ళ కుర్రాడు తన మొదటి నాలుగు ఫస్ట్-క్లాస్ గేమ్‌లలో సెంచరీలు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. డాన్ బ్రాడ్‌మాన్ వంటి దిగ్గజాలు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు. 9 ఇన్నింగ్స్ ల్లో అతని స్ట్రైక్ రేట్ 96 ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చోప్రా గతంలో అండర్-19, అండర్-23 స్థాయిలలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.