- స్కీమ్లు, రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి
- మిగతా గ్యారెంటీలు అమలు చేస్తారని నమ్మకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని ఏర్పర్చుకోగలింది. రేవంత్ పాలనపై 72శాతం మంది హ్యాపీగా ఉన్నట్లు తేలింది. ఇందులో 55 శాతం మంది రేవంత్ పాలనను అద్భుతం(ఎక్స్ట్రార్డినరీ)గా ఉందని పేర్కొనగా.. 7 శాతం మంది చాలా బాగుంది (వెరీ గుడ్) అని, 10 శాతం మంది బాగుంది (గుడ్) అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అగ్ని న్యూస్ సర్వీస్ అనే సంస్థ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 1 నుంచి 10 మధ్య ‘పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ’ పేరిట ఈ సంస్థ సర్వే చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. పల్లె పట్టణ ప్రాంతాలన్న తేడా లేకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎంగా రేవంత్ రెడ్డి నాయకత్వానికి జైకొట్టినట్లు సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న 72% మంది రేవంత్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మార్కులు వేశారు. 8% మంది మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. ఇంకో 20 శాతం మంది మాత్రం పాలనపై సంతృప్తిగా లేమని చెప్పినట్టు సర్వే సంస్థ వెల్లడించింది.
రుణమాఫీ అమలుపై రైతులు ఖుష్
రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ జర్నీ, రూ. 500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వంటి హామీల అమలుపై జనం సంతోషం వ్యక్తం చేసినట్లు సర్వేలో తెలింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని జనం పేర్కొన్నారు. మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశా రు. రుణమాఫీతో రైతులు చాలా సంతోషంగా ఉన్నట్టు సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తుందని 76% మంది అభిప్రాయపడగా.. 21% మంది మాత్రం నమ్మకం లేదని అభిప్రాయపడ్డారు. కాగా, హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులపై ప్రజలు మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ నిధులతో సిటీలోని ప్రజల జీవితాలు మరింత మెరుగవుతాయని 64% మంది అభిప్రాయపడగా.. 20% మంది అదేమంతా ప్రభావవంతమైన బడ్జెట్ కాదని రిప్లై ఇచ్చారు. మిగిలినోళ్లు చెప్పలేమన్నారు.