టెన్త్ అర్హతతో అగ్నివీర్ .. 8 నుంచి హైదరాబాద్​లో రిక్రూ​ట్​మెంట్ ​ర్యాలీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్​మెంట్​ ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 8 నుంచి16వ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్​ స్టేడియంలో అధికారులు ర్యాలీని నిర్వహించనున్నారు. 33 జిల్లాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పాల్గొనవచ్చు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్  క్లర్క్ / స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్,  అగ్నివీర్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు 8వ తరగతి పాసై ఉండాలని అధికారులు వెల్లడించారు. 

17–21 ఏండ్ల వయసు ఉండాలని తెలిపారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈవెంట్స్ ఉంటాయని పేర్కొన్నారు. మహిళా మిలిటరీ పోలీస్ (డబ్ల్యూఎంపీ) పోస్టులను కూడా  భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థులు ర్యాలీకి డాక్యుమెంట్లన్నీ తీసుకురావాలన్నారు. రిక్రూట్మెంట్  పారదర్శకంగా ఉంటుందన్నారు. డబ్బులిస్తే జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దన్నారు.  సందేహాలుంటే 040- 27740059, 27740205 నంబర్లను సంప్రదించాలని  సూచించారు.