జైపూర్‌‌ ప్లాంట్‌ నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం

జైపూర్‌‌ ప్లాంట్‌ నిర్మాణానికి  బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం
  • 40 నెలల్లో ప్లాంట్‌ పూర్తి చేయాలి: సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌
  • పనులు వెంటనే ప్రారంభిస్తామన్న బీహెచ్ఈఎల్ జీఎం పార్థసారథి దాస్ 

హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో జైపూర్‌‌లో నిర్మించనున్న 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను 40 నెలల్లోపు పూర్తి చేయాలని సంస్థ సీఎండీ బలరామ్ అన్నారు. దీనికి అనుగుణంగా వచ్చే నెల నుంచే పనులు ప్రారంభించాలని బీహెచ్‌ఈఎల్ అధికారులను కోరారు. 

మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ ప్లాంట్ ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్ టెండర్లు దక్కించుకుంది. దీనిపై తాజాగా బీహెచ్‌ఈఎల్‌తో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. నాలుగేండ్లలో ప్లాంట్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఒప్పందం ఉన్నప్పటికీ, ఇచ్చిన షెడ్యూల్‌లోపే పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. 

అనంతరం బీహెచ్ఈఎల్ జీఎం పార్థసారథి దాస్ మాట్లాడుతూ.. సింగరేణి ప్లాంట్‌ను అతి ప్రాధాన్య ప్రాజెక్టుగా తమ బోర్డు నిర్ణయించిందని, పనులను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. గతంలో చేపట్టిన 1,200 మెగావాట్ల ప్రాజెక్టులో ఎదురైన సమస్యలను ముందే అధిగమించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎండీ బలరామ్‌తో పాటు డైరెక్టర్లు, బీహెచ్‌ఈఎల్ జీఎం, హెడ్ పార్థసారథి దాస్, జీఎం జోగేష్ గులాటి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్లాంట్ పూర్తయితే ఏటా 300 కోట్ల లాభాలు

ఒప్పందం ప్రకారం 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ బాయిలర్స్, టర్బైన్స్, జనరేటర్ల ఏర్పాటుతో పాటు అన్ని రకాల సివిల్ వర్క్స్ బీహెచ్‌ఈఎల్ 48 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. సింగరేణిలో 2016లో ఏర్పాటైన 1,200 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ విజయవంతంగా నడుస్తున్నది. 

దీంతో కంపెనీకి ఏటా దాదాపు రూ.450 కోట్ల లాభాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాంటు దాదాపు 70 వేల మిలియన్ యూనిట్ల కరెంట్‌ను రాష్ట్ర అవసరాలకు అందించింది. అధిక పీఎల్‌ఎఫ్ సాధిస్తూ జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ప్లాంట్ పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఇదే ప్రాంగణంలో సింగరేణి మరో యూనిట్‌ను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాంట్‌ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణ పనులకు బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించింది. ఈ ప్లాంట్ పూర్తయితే సింగరేణికి ఏటా మరో రూ.300 కోట్ల వరకు లాభాలు చేకూరే అవకాశం ఉంది.