హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్‌గఢ్‌తో తాము అవగాహన ఒప్పందం చేసుకుందని విద్యుత్ శాఖ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విచారణ కమిషన్ సరిగా లేదని జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌కు లేఖ రాశానని ఆయన వెల్లడించారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం సరికాదన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి యూనిట్ కు రూ.3.90 పెట్టి విద్యుత్ కొన్నామని, ఆ సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్‌ను యూనిట్‌కు రూ.17 పెట్టి కొనుగోలు చేశాయన్నారు. ‘‘మేము యూనిట్ కు రూ.3.90 పెట్టి విద్యుత్ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు యూనిట్ కు రూ.4.90 పైసలు పెట్టి కరెంటు కొన్నాయి.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయి. 800 మెగావాట్లతో భద్రాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయింది. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని మేము తక్కువ రేటుకు ఇస్తే, ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చింది. విద్యుత్ కొనుగోళ్లలో రూ.6 వేల కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు” అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే విద్యుత్ విచారణ కమిషన్‌కు తాను లేఖ రాశానని ఆయన చెప్పారు.