హైదరాబాద్: దావోస్ ఆర్థిక సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యూనిలీవర్ కంపెనీ ముందుకు రాగా.. తాజాగా ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్‌తో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం.. స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఆ కంపెనీ దాదాపు రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.
ALSO READ | కామారెడ్డిలో పామాయిల్ తయారీ కంపెనీ: యూనిలివర్‌తో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందం
ఈ ఒప్పందం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ అత్యాధునిక సాంకేతిక అంతరిక్ష రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించటంతో పాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు అభినందించారు.
స్కైరూట్ కంపెనీతో ప్రభుత్వ భాగస్వామ్యం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెపుతుందని శ్రీధర్ బాబు అన్నారు. త్వరలోనే హైదరాబాద్ ప్రైవేట్ రంగ అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని స్కై రూట్ కో-ఫౌండర్ పవన్ కుమార్ చందన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ లక్ష్య సాధనలో భాగం పంచుకుంటామన్నారు.