హైదరాబాద్‎లో ఏఐ డేటా క్లస్టర్.. NTT డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం

హైదరాబాద్‎లో ఏఐ డేటా క్లస్టర్.. NTT డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం
  • ఎన్​టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా ఏర్పాటుకు నిర్ణయం
  • 25 వేల జీపీయూలతో అత్యంత శక్తిమంతమైన ఏఐ సూపర్​ 
  • కంప్యూటింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​రుద్రారంలో తొషిబా కొత్త ఫ్యాక్టరీ
  • రూ.11,062 కోట్ల పెట్టుబడులకు జపాన్​లో తెలంగాణ అధికారుల​ బృందంతో అగ్రిమెంట్స్​
  • రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టాలని పారిశ్రామికవేత్తలకుసీఎం రేవంత్​ ఆహ్వానం
  • మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్​ సిటీపై వీడియో ప్రజెంటేషన్​

హైదరాబాద్​, వెలుగు: జపాన్‎లో పర్యటిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం శుక్రవారం రూ.11,062 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్​ కుదుర్చుకున్నది. ఎన్‎టీటీ డేటా, నెయిసా జాయింట్‎గా రూ.10,500 కోట్లు, తొషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా).. హైదరాబాద్​సమీపంలోని రుద్రారంలో రూ.562 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​పెట్టేందుకు ముందుకొచ్చాయి.  

డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్‌‌టీటీ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌‌ఫాం సంస్థ నెయిసా నెట్‌‌ వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌‌ ఏర్పాటు చేయనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు  రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎంవోయూ కుదిరింది. 


సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్‌‌‌‌టీటీ డేటా, నెయిసా నెట్‌‌‌‌వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్  తడావోకి నిషిమురా, ఎన్టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్  డైరెక్టర్ అలోక్ బాజ్‌‌‌‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్  షరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పెట్టుబడుల ఒప్పందంపై  సీఎం రేవంత్​ రెడ్డి  ఆనందం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు ఇన్వెస్ట్​మెంట్స్‎ను ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఎన్‌‌‌‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో ఏడబ్ల్యూఎస్, ఎస్‌‌‌‌టీటీ, టిల్‌‌‌‌మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో  దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‎గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని చెప్పారు.  

దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూటర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​

హైదరాబాద్‌‌‌‌లో నిర్మించబోయే ఈ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్‌‌‌‌. 25 వేల జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌‌‌‌ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నది. ఎన్‌‌‌‌టీటీ డేటా, నెయిసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ- ఫస్ట్ సొల్యూషన్స్‎ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా ఉండనుంది. 

500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌‌‌‌కు దోహదం చేస్తుంది. 

టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌‌‌‌టీటీ డేటా.. ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్​ఫర్మేషన్ లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో లక్షా 93 వేల మంది ఉద్యోగులతో.. ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్ సర్వీసెస్, బీఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఐ, హెల్త్‌‌‌‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది.  

రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ

తోషిబా కార్పొరేషన్  అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌‌‌‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.  ఈ అగ్రిమెంట్​ ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది.

 వీటితోపాటు పవర్ ట్రాన్స్​ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్  ట్రాన్స్​ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌‌‌‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌‌‌‌గ్రేడ్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడంతోపాటు ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.  

రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ.. ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనున్నది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.  టోక్యోలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా,  స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్​ రంజన్, టీటీడీఐ చైర్మన్  మేనేజింగ్ డైరెక్టర్  హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.   

హైదరాబాద్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్​ 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌‌‌‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్​నర్​షిప్​ రోడ్‌‌‌‌షోలో.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ అధికార బృందం  వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సీఎం రేవంత్ ​మాట్లాడుతూ.. ‘దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న  తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నది. జపాన్‌‌‌‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ‘తెలంగాణ రైజింగ్’. ఈ రోజు  జపాన్‌‌‌‌లో తెలంగాణ ఉదయిస్తు న్నది” అని అన్నారు.  టోక్యో చాలా గొప్ప నగరమని, ఇక్కడి మౌలిక సదుపాయా లు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతమని కొనియాడారు. 

 హైదరాబాద్​ అభివృద్ధికి టోక్యో నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. కాగా, దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రి యల్ సిటీగా హైదరాబాద్​లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించతలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. రోడ్‌‌‌‌షో తర్వాత  జపాన్‌‌‌‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది.

సీఎం రేవంత్ రెడ్డి టోక్యోలోని సుమిధ రివర్ ఫ్రంట్‌ను సందర్శించారు. బోటులో తిరిగి అక్కడ అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని మూసీ నది, ట్యాంక్ బండ్‌ను సుమిధ రివర్ ఫ్రంట్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఆధునిక సాంకేతికతను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, పర్యావరణ నిపుణులతో సమావేశమై, నది శుద్ధీకరణ, పర్యాటక అభివృద్ధి విధానాలను చర్చించారు. సుమిధ రివర్ ఫ్రంట్ పర్యాటక, సాంస్కృతిక, పర్యావరణ కేంద్రంగా ఉందని సీఎం రేవంత్​ అన్నారు.