
- ఏఐకేఎఫ్, -ఏఐఏడబ్ల్యూఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్, వెలుగు: దేశ వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మండిపడ్డారు. బడ్జెట్లో తగిన నిధులు కేటాయించకుండా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య (-ఏఐఏడబ్ల్యూఎఫ్ ) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ‘కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు.. -రైతుల వ్యవసాయంపై ప్రభావం’ అనే అంశంపై గురువారం బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర బాధ్యులు, వివిధ జిల్లాల నాయకులు హాజరై చర్చించారు.
ఈ సందర్భంగా తీగల సాగర్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి మాట్లాడారు.
పాలకులు ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం రైతులకు ఆశాజనకమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించాలని డిమాండ్ చేశారు.