- వర్మికంపోస్ట్ తయారీలో అశ్వారావుపేట అగ్రికల్చర్కాలేజీ భేష్
- బిజినెస్ ప్లాన్‌కు దోహదపడుతున్న ఏఈఎల్పీ ప్రోగ్రామ్
- వర్మికంపోస్ట్ తో భూమికి మేలు.. రైతుకు మిగులు
భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ స్టూడెంట్స్ ఇటు చదువుకుంటూ.. అటు ఎరువు తయారు చేస్తూ భూమికి మేలు.. రైతులకు డబ్బు ఆదా చేస్తున్నారు. రసాయనాలు లేని సహజ సిద్ధమైన వర్మికంపోస్ట్ తయారు చేస్తూ రైతులకు తక్కువ ధరకే ఇస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. జిల్లాలో 4.51లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఆయా పంటలకు రైతులు పెద్ద మొత్తంలో రసాయనాలు వాడుతున్నారు.
రసాయనాల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ స్టూడెంట్స్ రసాయనాలు లేని వర్మి కంపోస్ట్ తయారు చేస్తూ, తక్కువ ధరకే అమ్ముతూ రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది అధిక దిగుబడులే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా రసాయన ఎరువులు, మందులు వాడుతున్నారు. దీంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. మరో వైపు ఎక్కువ మొత్తంలో రైతులు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వర్మి కంపోస్ట్ వాడకం ఎన్నో విధాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఏఈఎల్పీ ప్రోగ్రాంతో బిజినెస్ ప్లాన్..
అశ్వారావుపేటలోని అగ్రికల్చర్ కాలేజీ ఫైనల్ ఇయర్స్టూడెంట్స్కు అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ (ఏఈఎల్పీ) ప్రోగ్రామ్ ద్వారా బిజినెస్ ప్లాన్స్ ఇస్తున్నారు. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్‌లో జాబ్ రాకపోయినా తామే సొంతంగా వ్యాపారం చేసి ఆదాయం పొందేలా ఈ ప్రోగ్రామ్స్టూడెంట్స్కు దోహదపడుతుందని అసోసియేట్ డీన్ హేమంత కుమార్ పేర్కొంటున్నారు.
ఈ కాలేజీలో ప్రస్తుతం 165 మంది స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యూయేషన్ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్(ఫైనల్ సెమ్)లో ఐదు నెలల పాటు స్టూడెంట్స్ ఏఈఎల్పీ ప్రోగ్రామ్‌లో ఉంటారు. స్టూడెంట్స్ బ్యాచ్‌లుగా ఏర్పడి ఒక్కో బ్యాచ్ వారీగా ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యులవుతారు.
ఒక్కో స్టూడెంట్ఒక్కో పిట్..
కాలేజీలో వర్మి కంపోస్ట్ తయారీలో భాగంగా ఒక్కో స్టూడెంట్ఒక్కో పిట్(బెడ్)ను తీసుకున్నారు. పశువుల పేడ, వానపాములు, బ్యాగ్‌లు, పైపులు, వేప పిండి, మెష్ ఇతరత్రా వస్తు సామగ్రి కొనుగోలు కోసం మొత్తం రూ. 60వేలు ఖర్చు పెట్టారు. ఒక పిట్‌కు టన్నున్నర చొప్పున ఎనిమిది బెడ్లకు గానూ 12 టన్నుల వర్మి కంపోస్ట్ తయారవుతోంది. టన్నుకు రూ. 9వేలు చొప్పున రూ. 1,08,000 ఆదాయం వస్తోందని స్టూడెంట్స్ పేర్కొన్నారు. ఇలా ఏడాదిలో 5 నుంచి 6 సైకిల్స్ వరకు వర్మి కంపోస్ట్ తీసి ఆదాయం పొందేలా ఏఈఎల్పీ ప్రోగ్రామ్ ఉపయోగపడుతోంది.
రైతులకు ఎంతో మేలు..
మాములుగా తయారు చేసే ఎరువు కన్నా కాలేజీలో స్టూడెంట్స్ తయారు చేసే వర్మి కంపోస్ట్‌లో నత్రజని, ఫాస్ఫేట్, పోటాష్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పండ్లు, కూరగాయలు, పూల తోటల్లో మొక్క మొదట్లో వర్మి కంపోస్ట్ వాడితే మిత్ర సూక్ష్మ జీవులు భారీగా వృద్ధి చెందుతాయి. దీంతో మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఉంటుంది.
- డాక్టర్ టి.పావని, అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖర్చు తగ్గుతుంది..భూమిలో సారం పెరుగుతుంది..
ఇష్టారాజ్యంగా రసాయన ఎరువులను వాడుతుండడంతో భూమిలో భూ సారం తగ్గుతోంది. ఎరువుల వినియోగంతో రైతులు పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఏఈఎల్పీ ప్రోగ్రామ్‌లో సహజ సిద్ధమైన వర్మి కంపోస్ట్‌ను తయారు చేస్తూ రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నాం. ఖర్చు తగ్గుతుంది.. భూమిలో సారం పెరుగుతుంది. ఒకవేల ఉద్యోగం రాకపోయినా ఏఈఎల్పీ ప్రోగ్రామ్‌తో ఉపాధి పొందే ధైర్యం స్టూడెంట్స్‌లో వచ్చింది.
- డి. సిందూజ, స్టూడెంట్, అగ్రికల్చర్ కాలేజ్