వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. కూలీల లభ్యత లేకపోవడం, ఖర్చులు పెరిగిపోతుండడంతో క్రమంగా సాగులో ఆధునిక యంత్రాలు చొచ్చుకుపోతున్నాయి. మరోవైపు యువత డ్రోన్ల వంటి వాటితో కొంత ఉపాధి పొందుతున్నారు.
ఒకప్పుడు దుక్కి దున్నాలన్నా, విత్తనాలు వేయాలన్నా, ఎరువులు చల్లాలన్నా, కలుపు తొలగించాలన్న ప్రతి పనిని రైతులు కూలీలు చేసుకునేవారు. లేదా ఒకరికొకరు పరస్పరం అవగాహనతో పనులు కానిచ్చేవారు. కానీ ప్రస్తుతం ట్రెండు మారింది. ప్రతి పనిని సమయం, డబ్బు వృథా చేయకుండా రైతులు వినూత్న రీతిలో వ్యవసాయం చేసుకుంటున్నారు.
వానకాలం సాగు మొదలైంది. అడపాదడప వర్షాలు పడుతుండడంతో రైతులు పొలం బాట పడుతున్నారు. దుక్కి దున్నడం మొదలుకొని విత్తనాలు వేయడం, ఎరువులు వేయడం, కలుపులు తీయడం వరకు గతంలో కూలీలతో చేసే పనిని యంత్రాలతో చేస్తున్నారు. కూలి రేట్లు పెరగడంతో రైతులు యంత్రాల పైన దృష్టి సారిస్తున్నారు.
వ్యవసాయ డ్రోన్ల వినియోగం గురించి డ్రోన్లపై శిక్షణ ఇవ్వడంతో పాటు కోర్సులు కూడా ప్రారంభిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయాలు... సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌లతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ డ్రోన్‌లపై యువతకు శిక్షణ ఇస్తున్నాయి.
కంప్యూటర్ యుగంలో వ్యవసాయానికి వ్యవసాయ డ్రోన్‌లు చాలా ఉపయోగపడుతున్నాయని కాన్పూర్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ ( CSA ) ప్రొఫెసర్ డాక్టర్ సిఎల్ మౌర్య అన్నారు. రైతులకు ఖర్చులు తగ్గి అధికంగా లాభాలు వస్తున్నాయన్నారు.
ఒక ఎకరం పొలంలో 3-4 మంది కలిసి మందులు.. ఎరువులు మాన్యువల్‌గా పిచికారీ చేయాల్సి ఉంటుందని మౌర్య అన్నారు. దానికి కూడా చాలా గంటలు పడుతుందన్నారు. ఎరువులు, మందుల అవసరం ఎక్కువగా ఉండడంతో నష్టాలు కూడా వస్తున్నాయి. 20 నిమిషాల్లో డ్రోన్‌ని ఉపయోగించి ఒక ఎకరానికి మందులు లేదా ఎరువులు పిచికారీ చేయవచ్చన్నారు దీనివల్ల కూలీ ఖర్చు తగ్గడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది.
చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డ్రోన్ శిక్షణ
వ్యవసాయానికి ఉపయోగించే డ్రోన్ లపై శిక్షణ ఇచ్చేందుకు సీఎస్ ఏ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ) కోర్సును ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ డాక్టర్ సిఎల్ మౌర్య తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇందులో శిక్షణ తీసుకోవచ్చు అన్నారు. ఇంకా రైతులు, ఎఫ్‌పిఓలు , వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సంస్థల వ్యక్తులు కూడా శిక్షణ తీసుకోవచ్చన్నారు. శిక్షణ ఫీజును రూ.65వేలుగా డీజీసీఏ నిర్ణయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత పొందిన సర్టిఫికేట్ లైసెన్స్‌గా కూడా పనిచేస్తుంది.
రాజస్థాన్ ప్రభుత్వం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి వ్యవసాయ శాఖ ద్వారా డ్రోన్ పైలట్ల శిక్షణను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని కర్ణ నరేంద్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ జాబ్నర్ (SKN అగ్రికల్చర్ యూనివర్శిటీ జాబ్నర్)లో 6 రోజుల రెసిడెన్షియల్ డ్రోన్ శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ పొందుతున్న దరఖాస్తుదారునికి రూ.50 వేలు ఫీజుగా నిర్ణయించారు. ప్రభుత్వం ఈ ఫీజులో రాయితీ ఇస్తోంది, శిక్షణా కాలంలో రూ.9 వేల 300 ఇస్తుందన్నారు. ఇందులో రూ.5వేలు శిక్షణకు, రూ.4వేల 300 వసతి, భోజనానికి ఇస్తారు. ఆసక్తి గల దరఖాస్తుదారులు రాజ్ కిసాన్ సతి పోర్టల్ లేదా రాజ్ కిసాన్ సువిధ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఒక్కో కూలీకి రోజుకు విత్తనాలు వేయడానికి రూ. 300 నుంచి రూ. 400, అరక మనిషికి రూ. 1000, ఎద్దులకు రోజుకు 3000 కిరాయి ఉంది. మొక్కజొన్న సాగుకు ఎకరానికి విత్తనాలు వేయడానికి రూ. 4,000 నుంచి రూ. 5,000 వరకు అవుతున్నాయి. పంట పొలాల్లో పురుగుల మందుల పిచికారి, ఎరువులు చల్లడం, విత్తనాలను వేయడం వంటి తదితర పనులకు రైతులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. సేద్యానికి కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిన తరుణంలో దాన్ని అధిగమించేందుకు అన్నదాతలు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. డ్రోన్‌తో మందులు పిచికారీ చేయడం వలన సమయం ఆదాతో పాటు, తక్కువ మందు పడుతుంది.