ఏప్రిల్ 11 నుంచి నాంపల్లిలో వ్యవసాయ ప్రదర్శన

ఏప్రిల్ 11 నుంచి నాంపల్లిలో వ్యవసాయ ప్రదర్శన
  • అగ్రి ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాలు ఎగ్జిబిట్
  • పోస్టర్ ఆవిష్కరించిన రైతు కమిషన్ చైర్మన్, సభ్యులు

హైదరాబాద్, వెలుగు: ఈనెల 11తేదీ నుంచి 14 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 'వ్యవసాయ ప్రదర్శన 2025' నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామును 'తెలంగాణ రైతు మహోత్సవం -2025' పేరుతో అగ్రి, హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. ఇందులో  వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన ఎక్విప్​మెంట్స్ ​ప్రదర్శించనున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల రైతులు పండించే ఉత్పత్తులు, యంత్ర పరికరాలను ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించి పోస్టర్ ను  హైదరాబాద్ లో  రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, అగ్రి హార్టికల్చర్ సొసైటీ సభ్యులు ఆవిష్కరించారు.

అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ..రైతులకు, వినియోగదారులకు లాభం చేకూర్చాడమే లక్ష్యంగా  అగ్రి, హార్టికల్చర్ సొసైటీ పని చేయాలన్నారు. ప్రతీ పంటకు ఒక యంత్ర పరికరం రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మారి, ఆత్మహత్యలు ఆగాలన్నారు. విశాల దృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి రైతు కమిషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. 

రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు పండించేందుకు 200 మంది రైతులను ఒక చోట చేర్చామన్నారు. రైతు కమిషన్​ సభ్యులు మాట్లాడుతూ..ఖమ్మం జిల్లాలో మిర్చి రేటును దళారులే నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ రైతు, ఆదర్శ రైతు విధానం తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించినట్లు పేర్కొన్నారు.