రైల్వే గేటు పడింది.. ప్రాణం పోయింది

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మండలంలోని గుర్రాంపల్లికి చెందిన వ్యవసాయ కూలీ తొగరి మధు(30) గురువారం పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబసభ్యులు ఓ జీపులో అతడిని 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లిలోని హాస్పిటల్‌కు జీపులో తరలించారు. మార్గమధ్యలో పెద్దపల్లి–కునారం రైల్వే గేట్ వేసి ఉండడంతో ముందుకు వెళ్లే వీలు లేకుండా పోయింది. దీంతో అతడిని మోసుకుంటూ గేటు కింది నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. 

ఇందుకు సుమారు పది నిమిషాలు పట్టింది. గేటు దాటాక మరో వాహనంలో దవాఖానకు తరలించారు. దీనికంతటికీ సుమారు అరగంట పట్టడంతో అప్పటికే చనిపోయాడని డాక్టర్లు ప్రకటించారు. గేటు వద్ద లేట్ ​కాకపోతే బతికేవాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.