- భూములు తేలినా సాగుకు పనికి రావు
- నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌వాటర్‌లో 40 వేల ఎకరాలు మునక
- 4 ఏండ్లుగా నీటిలో భూములు..
- భూములు తీసుకొని పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు
పెద్దపల్లి, వెలుగు: నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌వాటర్ మునిగిన వ్యవసాయ భూములు తేలాయి. ఇన్నాళ్లూ నీటిలోనే ఉండడంతో ఆ భూములు సాగుకు పనికి రాకుండా పోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల కింద దాదాపు 40 వేల ఎకరాలు ఏటా మునుగుతూనే ఉన్నాయి. ఒక్క అన్నారం బ్యారేజీ కిందనే దాదాపు 4 వేల ఎకరాలు మునుగుతున్నాయి.
ఈక్రమంలో రైతులు పంటలు సాగుచేయడం బంద్ చేశారు. బ్యాక్‌వాటర్ చివర్లో ఉన్న భూముల్లో మాత్రం యాసంగి సీజన్‌లో సాగుచేస్తున్నారు. కాగా భూములు తేలినా సాగుకు పనిరావని, వాటికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మేడిగడ్డ డ్యామేజీతో ప్రాజెక్టులు ఖాళీ
కాళేశ్వరంలో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ ఇటీవల డ్యామేజీ కావడం, అన్నారం బ్యారేజీకి బుంగలు పడడంతో నీటిని ఖాళీ చేశారు. దీంతో బ్యాక్‌వాటర్‌లో మునిగిన భూములన్నీ నాలుగేళ్ల తర్వాత తేలాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తూనే, మరోవైపు ఆందోళన చెందుతున్నారు.
ఆ భూములు సాగుకు పనికిరావని, ఒకవేళ సాగు చేసినా నీళ్ల సౌలత్ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకముందు ఈ భూములకు మానేరు నది, బోరు బావుల నుంచి నీరందేది.
ప్రాజెక్టు నిర్మాణం తర్వాత బోర్లు, ఇతర వాటర్ సౌలత్‌లు బ్యాక్‌వాటర్‌లో మునిగి, ధ్వంసమయ్యాయి. బ్యాక్‌వాటర్‌తో భూములు మునిగినా, చివరన మిగిలిన కొద్దిపాటి భూములను బ్యాక్‌వాటర్‌లో మోటర్లు ఏర్పాటు చేసుకొని యాసంగిలో సాగుచేస్తూ వస్తున్నారు. ఇలా ప్రాజెక్ట్సమీపంలోని ఆరెంద, మల్లారం గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలు యాసంగిలో సాగుచేసేవారు.
ఇప్పుడు ఆ బ్యాక్‌వాటర్ కూడా ఎండిపోవడంతో ఈ భూముల్లోనూ సాగుచేయడం కష్టమంటున్నారు. వీటితోపాటు భూములు తేలినా నీటి వసతి లేక సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపు భూములు తీసుకోవాలని పోరాటం చేసినా నాటి బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూములు తీసుకొని పరిహారం ఇవ్వాలి
కాళేశ్వరం నిర్మాణంతో పంట భూములు ముంపు పాలైన రైతులు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోయారు. నాటి నుంచి ముంపు భూములను సర్కార్ తీసుకొని పరిహారం ఇవ్వాలని నాటి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. దీనిపై చాలాసార్లు రైతులు ఆందోళనకు దిగారు. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత వచ్చిన బ్యాక్‌వాటర్‌తో రూ. లక్షల విలువ చేసే బోర్లు నీట మునిగాయి.
ఇప్పుడు తిరిగి బోర్లు వేసుకొని తమ భూములను సాగు చేయాలన్నా రూ. లక్షల్లో ఖర్చవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసినా మళ్లీ ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ పెరిగితే ఈ ఖర్చంతా నీటిపాలుకాక తప్పదంటున్నారు.
ముంపు భూములు తీసుకోవాలి
బ్యాక్‌వాటర్‌తో మునుగుతున్న భూములకు శాశ్వత పరిష్కారంగా వాటిని సర్కార్ తీసుకొని పరిహారం ఇవ్వాలి. ఇప్పుడు భూములు పైకి తేలినా, భవిష్యత్‌లో మళ్లీ ముంపుకు గురికావచ్చు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. సమస్యను కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - సత్యనారాయణ, సర్పంచ్, మల్లారం
యాసంగి కూడా లేకుంటయింది..
నాలుగేళ్లుగా భూములన్నీ ముంపుకు పోయినా, మిగిలిన కొద్దిపాటి భూములను సాగుచేస్తున్నాం. వానాకాలం పంట వేయకపోయినా యాసంగిలో వేసేవాళ్లం. ఇప్పుడు బ్యాక్‌వాటర్ ఇంకిపోవడంతో ఈసారి యాసంగి కూడా కష్టమవుతట్లుంది. మా భూములన్నీ మాకు కన్పిస్తున్నాయి, కానీ నీటి సౌలత్ లేదు. మళ్లీ కొత్తగా బోర్లు వేయాలంటే రూ. లక్షలు ఖర్చు చేయాలే. - సుంకరి బాపు, రైతు, మల్లారం