సాగవుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్ఠ స్థానం వుంది. వర్షాధారంగా జూన్, జూలై మాసాల్లోను, నీటి పారుదల కింద సంవత్సరం పొడవునా సాగుచేయవచ్చు. దుంపజాతి పంటైన కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజి పొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా.దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. కర్రపెండలం నుంచి వివిధ ఉత్పత్తలను తయారీచేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో వుండటంతో వేలాది మంది రైతులు ఈ పంటసాగుతో ఉపాధిపొందుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా కర్రపెండలం సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పంట ఎప్పుడు నాటాలంటే..
వాణిజ్యసరళిలో సాగుచేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైంది. దేశవ్యాప్తంగా 15 లక్షల 70 వేల ఎకరాల్లో సాగులో వుంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణమండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా వుంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా , ఆరుతడి పంటగా సాగుచేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజన్సీ ప్రాంతాల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తారు. జూన్- .. జూలై మాసాల్లో ఈ దుంప పంట సాగు మొదలు పెడితే... డిసెంబరు నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంట కాలం, రకాన్నిబట్టి 8-నుంచి10నెలలు వుంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పధార్ధంతో పాటు, పిండి పధార్ధం ఎక్కువగా వుంటుంది.
కర్ర పెండలం.. సాగు రకాలు
వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపలనుంచి తయారుచేసే పౌడర్ ను వస్త్ర పరిశ్రమలో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోను, ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తియ్యగా వుంటాయి కనుక చిప్స్ తయారీలోను, వివిధ వంటకాల్లోను వాడుతున్నారు. మెట్టప్రాంతం , నీటి వసతి తక్కువగా వుండటంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గుచూపుతున్నారు. తేలికపాటి ఇసుక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలల్లో కర్రపెండలం దుంప వృద్ధి అధికంగా వుంటుంది. మన ప్రాంతంలో సాగుకు అనుగుణంగా హెచ్-226, హెచ్-165, శ్రీ ప్రభ, శ్రీ జయ, శ్రీ ప్రకాస్ వంటి రకాలు రైతులకు అందుబాటులో వున్నాయి.
ఎలా నాటాలంటే...
గత పంటనుంచే విత్తనాన్ని సేకరించి రెండునెలలపాటు విత్తనం భద్రపరుస్తారు. విత్తనాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేస్తారు.7నుంచి -10నెలల వయసున్న బలమైన కొమ్మలను విత్తనపు కర్రలగా ఉపయోగించాలి. విత్తనపు కొమ్మల కొనభాగాన్ని మొదలు భాగాన్ని తొలగించి 20సెం.మీ పొడవుగల ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ విత్తనపు ముచ్చెలనుంచి వేర్లు వృద్ధిచెందేందుకు 7 నుంచి 10 రోజులపాటు నారుమడిలో పెంచాల్సి వుంటుంది. ఎకరాకు 5 వేల విత్తనపు ముచ్చెలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1మీటరు వెడల్పు, రెండున్నర మీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన రెండు నారుమడులు అవసరం.
నారుమడి జాగ్రత్తలు
నారుమడిలో నాటేముందు మాంకోజెబ్ 3గ్రాములు, డైమిథోయేట్ 2మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముచ్చెలను ముంచి నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. 7నుంచి 10రోజుల్లో ముచ్చెలు వేర్లు తొడిగి, చిగురించటం ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 5టన్నుల పశువుల ఎరువు, 150కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 20కిలోల లిండేన్ లేదా మిథైల్ పెరాథియాన్ పొడి వేసి కలియ దున్నాలి. నేలను 30నుంచి -35సెంటీమీటర్ల లోతుగా 3నుంచి 4సార్లు దుక్కిచేయాలి. వర్షాల వల్ల భూమిలో తగినంత తేమచేరిన తర్వాత ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చెలను నాటటానికి ఉపయోగించాలి. వరుసలు, మొక్కల మధ్య ఎటుచూసినా 90సెంటీమీటర్ల ఎడం వుండేటట్లుగా, 5సెంటీమీటర్ల లోతులో ముచ్చెలు నాటుకోవాలి. నాటిన వారం పది రోజుల్లో ముచ్చెలనుంచి కొమ్మలు విస్తరించటం ప్రారంభమవుతుంది. నాటిన 10నుంచి 15రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో, 40సెంటీమీటర్ల పొడవున్న వేరు తొడిగిన ముచ్చెలను నాటాల్సి వుంటుంది.
ఎరువుల వివరాలు
కర్రపెండలం నాటిన 15 నుంచి 90రోజుల వరకు కలుపు లేకుండా నివారించాలి. ఈ పంటకు నత్రజని, పొటాష్ ఎరువులను పైపాటుగా అందించాలి. ఎకరాకు 24కి. నత్రజని, 24కి. పొటాష్ సరిపోతుంది. దీన్ని 3సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పుచేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. 3నెలల వరకు తోటలో రసంపీల్చు పురుగులు, మచ్చ తెగుళ్ల బెడద లేకుండా జాగ్రత్త వహించాల్సి వుంటుంది.
సాగులో ప్రధాన సమస్య
ఈ పంటలో ప్రధానమైన సమస్య కసావా మొజాయిక్ వైరస్. దీనికి నివారణ లేదు కాబట్టి తెగులు సోకని తోటల నుండి నాణ్యమైన విత్తనాన్ని ఎంపికచేసుకోవాలి. వైరస్ ను వ్యాప్తిచేసే తెల్లదోమను సకాలంలో అరికట్టాలి. దోమ కనిపించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1గ్రాము లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారిచేయాలి. మొజాయిక్ వైరస్ ను సమర్థంగా తట్టుకునే శ్రీ రక్ష -1, శ్రీ రక్ష -2 రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.
ఎప్పుడు నాటాలి... ఎప్పుడు కోయాలి
కర్ర పెండల దుంప పెరగడం వర్షం మీద ఆధారపడి వుంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆక్టోబరు నుండి డిసెంబరు వరకు 3 నీటితడులు ఇవ్వగలితే దుంప బాగా వూరి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ పంటను జూన్... -జూలైలో నాటితే ఫిబ్రవరి.. మార్చిలో దిగుబడి వస్తుంది. ఈ సమయంలో దుంప తవ్వి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకు తరలిస్తారు. రైతులు కర్రపెండల దుంప ఊరుదలనుబట్టి ఎకరాకు 40 నుంచి 50 పుట్ల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో పుట్టిని 225 కిలోలుగా లెక్కిస్తారు.