Agricultural: వరి పంటను ఇలా సాగు చేయండి.. అధిక దిగుబడిని పొందండి

Agricultural: వరి పంటను ఇలా సాగు చేయండి.. అధిక దిగుబడిని పొందండి

తెలుగు రాష్ట్రాల్లో వరి పంటను అధికంగా సాగు చేస్తారు.  అయితే కొంతమంది సరైన అవగాహన లేక తోటి రైతులు సంప్రదాయ పద్దతులు అవలంభించకుండా.. ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడకం వలన ఖర్చు ఎక్కువ​అయి దిగుబడి తగ్గి.. రైతన్నలు అప్పులపాలవుతున్నారు.  వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు వరి పంటను ఎలా సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందో తెలుసుకుందాం. . 
 
ప్రపంచ వ్యాప్తంగా ఆహార అవసరాలను తీర్చడం లో మొదటి స్థానం లో ఉన్న వరి పంటని  పండిచడం లో మన రైతులు సంప్రదాయ పద్ధతులను విడిచి ... చాలా మంది రైతులు తమ తోటి రైతుల సలహాలు ...  సూచనల మేరకు మోతాదుకు మించి  రసాయన ఎరువులు ...  పురుగు మందులను ఎక్కువగా వాడటం వలన పర్యావరణ సమతుల్యత లోపించడంతో పాటు దిగుబడి తగ్గుతుంది.  అంతేకాదు చీడపీడల్లో (పురుగులు) రసాయనాలను తట్టుకునే సామర్యం పెరగడం వల్ల సాగు పెట్టుబడి ఖర్చు పెరిగి పోతుంది. వరి పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్దతులను తెలుసుకుందాం.

నేల స్వభావాన్ని తెలుసుకోవాలి

 వరి పంట వెయ్యాలని ఎంచుకున్న పొలంలో నేల యొక్క స్వభావమును తెలుసుకోవడానికి  పరిక్షలు జరిపి భూమిలోని  లోపాలను సరిచేసుకోవాలి. వేసవిలో భూమిని లోతుగా దున్ని దుక్కిని ఎండపెట్టుకోవాలి. పంట వేసే ముందు జనుము, జీలుగా, పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను వేసి పూత దశలో బురదలో కలియ దున్ని బురదలో మగ్గనివ్వాలి.

 గత పంట అవశేషాలు పూర్తిగా తొలగించాలి. ఆయా ప్రాంతలను వాతావరణ పరిస్థితులను బట్టి చీడ పీడలను ... తెగుళ్లను తట్టుకునే వరి రకాలను ఎంచుకోవాలి.  నారుమడి సిద్ధం చేసుకునే ముందు విత్తనశుద్ధి తప్పనిసరిగా చెయ్యాలి. పొలం గట్లమీద కలుపు మొక్కలు లేకుండా చేసుకోవాలి.

భూమి  స్వభావాన్ని బట్టి ఎరువుల యాజమాన్య పద్ధతులను పాటించాలి. అధిక దిగుబడి కోసం తెగులు మరియు పురుగు వ్యాప్తిని మొదటి దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. సరైన పద్దతిలో నీరు ....పొలం మడిలో  నిలువ ఉండేలా నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి. సరైన పక్వదశలోకి రాగానే పంట కోతను చేపట్టాలి. గింజలో తేమ శాతం తక్కువ ఉండేలా ఎండలో ఆరబెట్టాలి. తేమ శాతం  తగ్గిన తరువాత ధాన్యాన్ని నిల్వ చెయ్యాలి. ధాన్యాన్ని నిల్వ చెయ్యడానికి గోనేసంచులను మాత్రమే ఉపయోగించాలి.

విత్తే సమయం.. నారుమడి సిద్ధం చేసుకునే విధానం 

ఎకరాకు 2 గుంటలు లేదా 5 సెంట్ల స్టలాన్నీ నారుమడి కోసం సిద్ధం చేసుకోవాలి. 20-నుంచి24 కిలోల విత్తనం నారుమడిలో విత్తుకోవాలి. విత్తనం వేసే సమయం లో ఎకరా నారుమడిలో యూరియా 2.5 కిలోలు + సింగిల్ సూపర్ పాస్పేట్ 6.5 కిలోలు + మ్యురేట్ ఆఫ్ పొటాష్ 1.75 కిలోల మొత్తాన్ని సిద్ధం చేసుకున్న నారుమడి దుక్కిలో వేసుకోవాలి. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో సింగిల్ సూపర్ పాస్పేట్ రెట్టింపు మోతాదులో వెయ్యాలి. 2.5 కిలోల యూరియాను విత్తిన 12- నుంచి 14 రోజులలోపు పిచికారి చేయాలి

నారుమడిలో ఊద నిర్మూలనకు బ్యుటా క్లోర్ 50ml/10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 7-9 రోజుల్లో లేదా సైహలోపాస్-పి-బుటైల్ 20ml/10 లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన 14- నుంచి 16 రోజుల్లో మడిలో నీటిని తీసివేసి పిచికారి చెయ్యాలి. రబీలో చలి వలన జింక్ లోప లక్షణాల సవరణకు జింక్ సల్ఫేట్ 20గ్రాములను 10 లీటర్ల నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చెయ్యాలి.

నాటు కోసం పొలాన్ని సిద్ధం చేసుకునే విధానం

వరి నారు వయస్సు 25 నుండి 30 రోజులు మించకుండా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో పొలంలో వేసిన నారు మొదటి ఎదుగుదల బాగుంటుంది. ఒక్కవేళ నాటు వెయ్యడం ఆలస్యమైనప్పుడు నారు కొనలను త్రుంచి నాటు వెయ్యాలి. వివిధ తెగుళ్ల నివారణకు పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

నాటు వేసే ముందు రెండు నుండి మూడు సార్లు వారం రోజుల వ్యవధిలో  పొలాన్ని దమ్ము చెయ్యాలి. ఇలా చేస్తే కలుపు మొక్కలను పూర్తిగా నాశనం చెయ్యవచ్చు.  బురద పొలంలో చివరి దమ్ములో ఎకరానికి ఒక్క బస్తా D.A.P (50 కిలోలు) + యూరియ 10 కిలోలు + మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1౦ కిలోలు చేసి నాటు వెయ్యడం చేపట్టాలి. నత్రజని ఎరువును యూరియ రూపంలో పైరు ఎదుగుదలను బట్టి 2 నుండి 3 సార్లు బురద పదనులో వెయ్యాలి.పైరు 50 – 60 రోజుల మద్య వయస్సులో 50 కిలోల యూరియలో మ్యూరేట్ ఆఫ్ పోటాష్ 15 కిలోలు కలుపుకొని తప్పని సరిగా వెయ్యాలి. తెగుళ్లకు వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన పురుగు మందులను మాత్రమే ఉపయోగించాలి.

చీడ పీడల బారి నుంచి వరి పంటను కాపాడుకొనేందుకు వేసవిలో దుక్కులను లోతుగా వేసుకోవాలి. నేలకు అనువైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.(సుడిదోమ, ఉల్లికోడు, అగ్గితెగులు) లాంటి చీడపీడలనుతట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.పురుగు మదులపై ఆధారపడి సేద్యం చేయ్యరాదు. నాటు వెయ్యడం ఆలస్యం కాకుండా చూసుకోవాలి.సుడిదోమ ఆశించిన ప్రాంతాలలో కాలి బాటలు వెయ్యడం తప్పనిసరి. ఇలా వ్యవసాయాధికారుల సూచనలు పాటించి వరి పంటను సేద్యం చేస్తే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది.