
మెదక్, వెలుగు: యాసంగి సీజన్ వరి పంట కోతలు మొదలయ్యాయి. రైతులు వరి ధాన్యాన్ని రోడ్ల మీద, కళ్లాల్లో ఆరబోస్తున్నారు. ఈ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 2.61 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగుచేశారు. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అగ్రిక్చలర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు రెవెన్యూ, సివిల్సప్లై, కో ఆపరేటివ్, మార్కెటింగ్, డీఆర్డీఏ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ల అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
399 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు మొత్తం 399 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 200, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో 199 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నుంచి పాపన్నపేట, హవేలీఘనపూర్ మండలాల్లో కొనుగోలు ప్రక్రియ మొదలైంది.
ఇబ్బందులు లేకుండా చూడాలి
హార్వెస్టర్ల ద్వారా వరి కోతలు జరుగుతుండడంతో ధాన్యం పెద్ద మొత్తంలో కేంద్రాలకు చేరుతుంది. సకాలంలో కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టకపోవడం, సరిపడ గన్నీ బ్యాగులు సమకూర్చకపోవడం, హమాలీలు, లారీల సమస్య వల్ల గత సీజన్లలో రైతులు ఇబ్బందులు పడ్డారు. రోజులు, వారాల తరబడి రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.
అంతేగాక అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసిపోయింది. అందువల్ల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సకాలంలో ఎంపిక చేసిన అన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలు తెరచి, అవసరమైన ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు, హమాలీలు, తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలు సమకూర్చాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి
అధికారులు వరి ధాన్యం కొనుగోలు సరిగ్గా నిర్వహించాలి. అన్ని కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. ధాన్యం తూకం పారదర్శకంగా జరిగేలా చూడాలి. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించి మద్దతు ధర పొందాలి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తేమ శాతం 17 ఉండేలా చూసుకుని, చెత్తా చెదారం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. రైతులకు టోకెన్లు ఇచ్చి సీరియల్ ప్రకారం వడ్లు కాంటా పెట్టాలి.
వెంకటేశ్వర్లు , అడిషనల్ కలెక్టర్