ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..!

ఖమ్మం  జిల్లాలో వ్యవసాయ పనులు షురూ..!
  • ముందస్తు వానలతో పనులు మొదలు 
  • దుక్కులు దున్నుతున్న అన్నదాతలు 
  • పత్తి, పచ్చిరొట్ట పంటల సాగుకు సన్నాహాలు

ఖమ్మం/ భద్రాచలం, వెలుగు: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయ పనులు షురూ అయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ముందస్తుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు. ఇన్ని రోజులు విపరీతమైన ఎండలతో ఎండిన దుక్కులను పంట సాగు చేసేందుకు అనువుగా తయారు చేస్తున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు సాగు విస్తీర్ణం ఆధారంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్​ చేస్తున్నారు. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురిస్తే వానాకాలంలో ఖమ్మంలో 7 లక్షలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4.87 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను అందిస్తుందన్న నేపథ్యంలో రైతులు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, పిల్లి పెసర, జనుములు జల్లేందుకు రెడీ అయ్యారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా వరి తర్వాత పత్తిని అత్యధిక ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా.  అన్ని పంటలకు అవసరమయ్యే యూరియా, డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్స్​ ఎరువులు కలిపి ఖమ్మం జిల్లాలో  2,24,819, భద్రాద్రిలో 1,01,444 మెట్రిక్​ టన్నులు అవసరం అవుతాయని ఆఫీసర్లు లెక్కలు వేశారు.