సమస్యల సుడిలో ఎవుసం

రోజురోజుకు కుంటుపడుతున్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వ్యవసాయ  రంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు గమనిస్తే ఈ వాస్తవం స్పష్టమవుతుంది. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే దేశంలో సమగ్ర వ్యవసాయ విధానం లేకుండా పోయే ప్రమాదం ఉంది. కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు, కల్తీ విత్తనాలు మార్కెట్​లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇప్పటికీ దేశంలో నూటికి అరవై ఐదు శాతం కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయం, దానిపై ఆధారపడిన కోట్ల మంది ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల స్థాయి వ్యవసాయ అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన చేయించి రైతులను చైతన్యవంతులను చేసేలా ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాల్సిన అవసరం ఉంది.

పూర్వం రైతులు వరి, పెసర, కంది సజ్జలు, నువ్వులు, ఉలవలు, రాగులు, మినుములు పజ్జొన్నలు, ఎర్ర జొన్నలు, తెల్ల జొన్నలు, మక్కజొన్న, బుడ్డ శనగలు, అలసంద, గోధుమ తదితర పంటలు సాగు చేసేవారు. ఈ సంప్రదాయ వ్యవసాయం వల్ల పల్లెల్లో గ్రామీణ స్వయం పోషక విధానం ఉండేది. కానీ వ్యవసాయంపై కార్పొరేట్, మార్కెట్​ప్రభావం పెరిగిన తర్వాత ఎక్కువ శాతం రైతులు వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి సాగుతో పాటు పండ్ల తోటలను పెంచడానికి మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలు, ఆరుతడి పంటల సాగు తగ్గిపోయింది. చిరుధాన్యాల పంటలన్ని కూడా వర్షాధార పంటలు. వర్షాధార పంటలు రోహిణి కార్తి లోనే విత్తనాలు వేసి పండించే వారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు ప్రస్తుతం ఈ పంటల సాగుకు అనుకూలించడం లేదు. పూర్వం ఈ ఆహార పంటలు, ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఉండి స్వయం పోషక విధానంలో కొనసాగేది. ప్రస్తుతం పట్టణాలకు దగ్గర ఉన్న సారవంతమైన భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోయాయి. కొద్దో గొప్పో మిగిలిన భూముల్లో వాతావరణ మార్పుల వల్ల చిరుధాన్యాల సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపకపోవడం లేదు. మరోవైపు ఇప్పటి వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా అభివృద్ధి చేసిన చిరుధాన్యాల విత్తనాలు మనకు అందుబాటులో లేవు. దీంతో మనం చిరుధాన్యాలు, పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటున్నాం.

ఆకాశాన్నంటుతున్న ఆహారధాన్యాల ధరలు 
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పంటల ప్రణాళిక అశాస్త్రీయమని గత రెండు సీజన్ల అనుభవం చెప్తోంది. 85% సాగు భూముల్లో వరి, పత్తి లాంటి పంటలు వేయాలని ప్రోత్సహించి, చిరుధాన్యాల సాగును పట్టించుకోవడం లేదు. వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధిస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా అధికారిక నివేదికల్లో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. గత ఐదేండ్లలో తొలిసారి 2019–20లో శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. 2018–19లో రూ.1.30 లక్షల కోట్ల ఎగుమతులుండగా... నిరుడు అంతకన్నా రూ.15 వేల కోట్లు తగ్గాయి. ఆహార ఉత్పత్తుల ఎగుమతుల మండలి రిపోర్ట్ ప్రకారం దేశంలో చిరుధాన్యాల సాగు చాలా తగ్గిపోతోంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఆకలి తీర్చే పంటల సాగు తగ్గిపోతుండడం భవిష్యత్తుకు ముప్పు. దేశంలో వార్షిక తలసరి బియ్యం లభ్యత 1961 లో 73.4 కిలోలు ఉండగా.. 2019లో అది 69.1 కిలోలకు తగ్గినట్లు వ్యవసాయ శాఖ నివేదిక చెబుతోంది. దేశంలో వంటనూనె ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇందుకోసం రూ.70 వేల కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం చెల్లిస్తున్నాం. ఆహారధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో బియ్యం ధర మార్కెట్లో రూ.50 దాటింది. పాలకులు మాత్రం కరోనా సమయంలో అందరూ తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ప్రకటనలు ఇస్తున్నారు. 

రైతులపై ప్రభుత్వాల చిన్నచూపు
వ్యవసాయ రంగం అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రకటించినా ఇప్పటివరకు ప్రభుత్వం దాని అమలు దిశగా అడుగులు వేయ లేదు. 2018–-19కి గాను పంటల బీమా ప్రీమియంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కంపెనీలకు ఇంకా చెల్లించలేదు. 2020 వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా అమలు నిలిపేసింది. 2021 వానాకాలం సీజన్​కూ గడువు ముగిసినా నోటిఫికేషన్ విడుదల కాలేదు. సబ్సిడీపై రైతులకు విత్తనాలు అందించే పథకం నీరుగారిపోయాయి. రైతులకు పెట్టుబడి సమకూర్చడానికి వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. పేద, సన్నకారు రైతులకు దాని వల్ల ఒనగూరుతున్న ప్రయోజనం ఎంత.. భూస్వాములకు జరుగుతున్న మేలు ఎంత అన్నది తెలిసిందే. దేశంలో 24 రకాల పంటలకు కేంద్రం ఏటా కనీసం మద్దతు ధర(ఎమ్మెస్పీ) ప్రకటిస్తుంది. అయితే మార్కెట్లో ఉన్న వ్యవస్థలు మద్దతు ధర ఇప్పించే పూచీకత్తు తీసుకోకపోవడం ఇందులో పెద్ద లోపం. రైతులు తమ పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం అంటుంది. దాదాపు 70 శాతం ఉన్న చిన్న రైతులకు దేశంలో ఎక్కడికైనా పంటను తరలించి అమ్ముకోగలరా? రవాణా ఖర్చులు భరించగలరా?  మద్దతు ధర వచ్చే వరకు పంట దాచుకునేందుకు శీతల గిడ్డంగులు సరిపడా లేకపోవడంతో రైతులు పంటను అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు సరిగా లేకపోవడమే కాకుండా తూకంలో తరుగు పేరుతో భారీగా కోత పెడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.  వ్యవసాయ రంగం సంక్షోభంలోకి జారుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇందు కోసం ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. సమగ్ర విధానంతో దేశీయ వ్యవసాయాన్ని సంస్కరిస్తే రైతులకు మేలు జరుగుతుంది.

పెరుగుతున్న సాగు వ్యయం
అధిక రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వినియోగం పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. 2014 –15 లో పురుగుమందుల వినియోగం సంవత్సరానికి 2,806 మెట్రిక్ టన్నులు కాగా 2019–20లో 4,915 మెట్రిక్ టన్నులకు పెరిగింది. రసాయన ఎరువుల వినియోగం ఎకరానికి దేశ సగటు 53.9 కిలోలు కాగా మన రాష్ట్ర సగటు 177 కిలోలుగా ఉంది. ఇది ఎకరానికి 100 కిలోల కంటే ఎక్కువ. ఎరువుల అధికవాడకం వాతావరణాన్ని, భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. అంతేకాకుండా రైతులకు వ్యవసాయ ఖర్చులు పెంచుతున్నాయి. దీంతో రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

- డా.రక్కిరెడ్డి ఆదిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్