పాకెట్ మనీతో వ్యాపారం చేయటం.. పాకెట్ మనీతో విహార యాత్రలు చేయటం.. పాకెట్ మనీతో పెట్టుబడులు పెట్టటం చూశాం.. ఈ ఇద్దరు స్నేహితులు మాత్రం పాకెట్ మనీతో వ్యవసాయం చేశారు.. చిత్రంగా అనిపించినా.. దేశంలో మొదటిసారి ఇలాంటి ఘటన జరగటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ... మహా పురుషులౌతారు... ఇది వెనుకటి సామెత... కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పారు ఇద్దరు స్నేహితులు. వ్యవసాయం దండగ... చాలా కష్టం.. అనుకునే ఈ రోజుల్లో ఇద్దరు విద్యార్థులు కలిసి పెద్దవారికి తెలియకుండా పంట పండించి ఔరా అనిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...
ప్రీతమ్ రాజేంద్ర చవాన్.... ప్రథమేష్ పాండురంగ్.. ఇద్దరు స్నేహితులు.. వీరు బీఎస్సీ( అగ్రికల్చర్) నాలుగో సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరు కలిసి 35 గుంటల భూమిని లీజుకు తీసుకున్నారు. పాకెట్ మనీని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి పుచ్చకాయ పంటను సాగు చేశారు. వీరిది వ్యవసాయ కుటుంబం కావడంతో అందులోని లోటు పాట్లు.. కష్ట నష్టాలు వారికి తెలుసు. అయినా ఏ మాత్రం జంకకుండా.... లక్షా 60 వేలు పెట్టుబడి పెట్టారు. పుచ్చకాయ పంట పండటంతో వారి కష్టానికి తగిన ఫలితం వచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో పుచ్చ కాయ ధర కిలో రూ. 13 పలుకుతుండగా .... వారు లీజుకు తీసుకొన్న కొద్దిపాటి భూమిలో 30 టన్నుల వాటర్ మిలాన్ పంట పండింది. దీంతో వారికి రూ. 3 లక్షల ఆదాయం చేకూరుతుందని భావిస్తున్నారు.
ఓ పక్క చదువు.. మరో పక్క వ్యవసాయం
వ్యవసాయాన్ని షేర్ హోల్డింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న యువకులు తలసందె సమీపంలోని ఓ 35 గుంటల భూమిని లీజుకు తీసుకున్నారు ప్రీతమ్ రాజేంద్ర చవాన్ .. ప్రథమేష్ పాండురంగ్ స్నేహితులు. ఆ భూమిలో మూడు నెలల పంట పుచ్చకాయను సాగు చేశారు. పొలం దున్ని.. సాగుకు సిద్దం చేసిన తరువాత డ్రిప్ పరుపులు.. విత్తనం వేయడానికి కావలసిన చర్యలు తీసుకొని నాటారు. ఓ పక్క చదువుతూనే.. మరో పక్క వ్యవసాయం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ అనే మేలు రకమైన పుచ్చకాయ పంట వేయాలని నిర్ణయం తీసుకొని ప్రారంభించారు. ఇంతలో ప్రకృతిలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో కొన్ని మొక్కలు దెబ్బ తిన్నాయి. అయినా ఆత్మవిశ్వాసంతో ...కుళ్లిపోతున్న మొక్కలపై జాగ్రత్తలు తీసుకొని కాపాడారు. అయితే ఈ సాగుకు వారు ఎక్కడా కూలీలను పెట్టుకోలేదు. పంటకు సంబంధించి ఏ పనైనా వారే కలిసి చేశారు. డ్రిప్ లో చాలా కష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందని వారు తెలిపారు. ఏది ఏమైనా వీరి చదివే చదువును ఆచరణలో పెట్టి.. రైతన్నలకు ఆదర్శం గా నిలిచిన ఫార్మర్ స్టూడెంట్స్ కు హ్యాట్సాఫ్. . . .