తెలంగాణాలో వ్యవసాయం చేస్తూ, పొలం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. కానీ వారికి భూమి లేదు. భూమి ఉన్నవాళ్ళ దగ్గర స్తోమత మేరకు కౌలుకు తీసుకుని తమ జీవనోపాధి కొనసాగిస్తారు. అన్ని రకాల జీవనోపాధుల సంక్షేమం పట్ల బాధ్యత ప్రభుత్వానికి ఉన్నట్లే, వీరి పట్ల కూడా ఉండాలి. కానీ, ఆశ్చర్యంగా, గత పదేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవనోపాధిని గుర్తించడానికి నిరాకరించింది. వారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది.
తన వ్యక్తిగత ఆలోచనలను ప్రభుత్వ విధానాలుగా మలిచిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అనేక సందర్భాలలో వారిని బాహాటంగా తూలనాడడం శోచనీయం. కేంద్ర ప్రభుత్వ పథకాలలో కూడా కౌలు రైతులను లబ్దిదారులుగా చేర్చలేదు. కౌలు రైతు రక్షణకు చట్టాలు ఉన్నాయి. కానీ కౌలు రైతును ఆర్థికంగా ఆదుకోవటానికి, ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులుగా గుర్తించటానికి ఈ ‘రక్షణ’ చట్టాలు అడ్డంకిగా మారాయి.
భూమిని వ్యాపార వస్తువుగా మార్చుతున్నారు
భూమి కిరాయికి ఇచ్చుడు ప్రోత్సహించాలని ప్రపంచ బ్యాంకు చెప్పినందుకు మన దేశ ప్రభుత్వాలు భూసంస్కరణలు కాకుండా భూమిని వ్యాపార వస్తువుగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా విధానాలు మార్చుతున్నాయి. ఇంకొక వైపు, చిన్న కమతాల వ్యవసాయం లాభదాయకం కాదని, ఉత్పాదకత పెరగదని, వ్యవసాయంలో ‘అనవసర’ మానవ వనరులని తగ్గించాలని, పెద్ద కమతాలను ప్రోత్సహించడం పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా, వ్యవసాయ భూమి వ్యవసాయం నుంచి ‘మళ్లడం’ ఎక్కువ అయ్యింది. ఇతర వ్యాపారాల్లో వచ్చిన ‘లాభాల’ తో భూమి కొని పడావు పెట్టడం సాధారణం అయిపోయింది. భూమి కిరాయి కొరకు నిర్దేశించిన ప్రభుత్వ విధానాలు ఇప్పటికే ఉన్న కౌలు రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని చేసినవి కావు. చిన్న, సన్నకారు కౌలు రైతులకు వ్యతిరేకంగా తమ ‘ఆలోచనలను’ పెంచుకున్నది. 2015లో నీతి ఆయోగ్ భూమి లీజును చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది అని భావించి డాక్టర్ టీ. హక్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. భూమి కిరాయికిచ్చే చట్టాలను సమీక్షించి, నిబంధనలను సరళీకరించి, కౌలు పద్ధతి పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. విచిత్రంగా కౌలు రైతులను ఆదుకోవడానికి కాకుండా వ్యవసాయ భూమి కాంట్రాక్టు, లీజ్‌కు ఇవ్వడానికి ఈ కమిటీ కసరత్తు చేసింది.
కౌలురైతు చట్టం–2011
ఏపీ లైసెన్స్ పొందిన సాగుదారుల చట్టం, 2011, ద్వారా కౌలురైతులను గుర్తించి రుణం మంజూరు కోసం లైసెన్స్ పొందిన అద్దెదారులందరికీ వార్షిక ప్రాతిపదికన అర్హత కార్డ్‌లు ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ కార్డుల ద్వారాబ్యాంక్ రుణం, బీమా, సబ్సిడీ మొదలైన వాటిని కౌలు రైతులకు వర్తింప చేసే ప్రయత్నం ఇది. అప్పట్లో, రాష్ట్రంలో 17.4 లక్షల కౌలు రైతుల్లో 6.8 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. 2011-–12లో 5.1 లక్ష ఎల్ఈసీ కార్డులు అయినాయి. 2012-–13లో ఈ సంఖ్య 4.1 లక్షలకు తగ్గింది. ఈ తీరున, కేవలం దాదాపు 24 శాతం కౌలు రైతులు మాత్రమే గుర్తింపు పొందారు. తదుపరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం, 2019ని ఆమోదించింది. ఇది 2011 చట్టం, 1956 చట్టం స్థానంలో వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు జారీ చేసే కార్డు కౌలు రైతుకు భూ యజమానికి మధ్య ఒక 11 నెలల ఒప్పందంగా చట్టంలో పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భూమి సర్వే నంబర్ సహా ఇతర వివరాలు ఉంటాయని చట్టం ఆశించింది.
ధరణితో కాస్తు కాలమ్ గాయబ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన కౌలుదారుల గుర్తింపు చట్టం ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదు. అట్లని ఆ చట్టాన్ని రద్దు కూడా చేయలేదు. కానీ భూ రికార్డుల డిజిటలైజేషన్ చేపట్టింది. ధరణి ప్రాజెక్ట్ కింద భూ రికార్డులను సవరించింది. భూ యజమానులకు లబ్ధి చేకూరేలా కాస్తు సమాచారం తీసివేసింది. కాలం తీసివేయడం, రైతుబంధు ఇవ్వడంతో, భూ యజమానులు ‘కౌలు’ కి ఇవ్వడానికి ఇష్టపడతలేరు. వ్యవసాయం చేయకపోయినా ‘రైతు బంధు’ రావడంతో ‘కౌలు కిరాయి’ మీద ఆసక్తి తగ్గింది. కౌలు విలువ పెరిగింది. గ్రామీణ సామాజిక స్థాయిలో ఏదో విధంగా కొనసాగుతున్న కౌలు వ్యవస్థలో రైతుబంధు చిచ్చుపెట్టింది.
అసలు సమస్యనే ఇది
ఏపీ టెనెన్సీ యాక్ట్, 1956 చట్టం కౌలుదారులకు సాగు చేస్తున్న భూమిని యజమాని అమ్మితే కొనుగోలు చేయడానికి మొదటి హక్కును ఇచ్చింది. కౌలు క్రింద 12 సంవత్సరాల పాటు భూమిని సాగు చేస్తే కౌలుదారుకు భూమిపై పూర్తి యాజమాన్య హక్కులను ఇచ్చింది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికి, భూమి మీద హక్కులు కోల్పోవద్దని, వ్రాతపూర్వక ఒప్పందం జోలికి పోకుండా భూ యజమానులు జాగ్రత్త పడుతున్నారు. 2019 చట్టం ప్రకారం 1956 చట్టం రద్దు అయింది. 2019 చట్టం 12 సంవత్సరాల తరువాత యాజమాన్య బదిలీ నిబంధన లేదు. అయినా కూడా భూ యజమానులు రాతపూర్వక, భూమి సర్వే నంబర్ వివరాలతో కూడిన ఎటువంటి ఒప్పందం చేసుకోవడం లేదు. స్వచ్చందంగా అసలే చేసుకోరు. ఇంకొక వైపూ, ప్రభుత్వం రాతపూర్వక ఒప్పందం మీద ‘ఒత్తిడి’ తెస్తే తమ కౌలు పోతుందని కౌలు రైతులు ఆందోళన పడుతున్నారు.
ఈ పద్ధతి పాటిస్తే సత్ఫలితాలు రావచ్చు
గ్రామాలవారీగా, గ్రామసభలో కౌలు పద్ధతిలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలను గణన చేయాలి. అదీనూ భూమిలేని కౌలు రైతులను గుర్తించాలి. ఒక పట్టిక తయారు చెయ్యాలి. ఈ పట్టికలో ఉన్న వారి పేర్లను భూమి యజమానులతో సంప్రదించి సరి పోల్చుకోవాలి. ఈ పట్టికలో ఉన్న వారికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఇది ఒక జీవనోపాధి గుర్తింపు కార్డు గా ఇవ్వాలి. కౌలు చేస్తున్న భూమి తదితర వివరాలు దానితో జత చేయరాదు. ప్రతి సంవత్సరం గ్రామ సభల ద్వారా వీరి జీవనోపాధి కొనసాగుతున్నదా లేదా నిర్ధారించాలి. వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వార కూడా నిర్దారణ చేయవచ్చు. ఈ నిర్ధారణలో అవినీతి తావులేకుండా, అసలు కౌలు రైతులు అన్యాయం కాకుండా, బినామి కౌలు రైతులు ఈ కార్డులు పొందకుండా విధి విధానాలు రూపొందించాలి.ఈ గుర్తింపు కార్డుకు ప్రభుత్వం గ్యారంటి ఇచ్చి వారికి కావాల్సిన సబ్సిడులు అందజేస్తూ, ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా చేర్చాలి.
కష్టాలు, నష్టాలు
దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో 80% కౌలు రైతులే. బ్యాంకు రుణాలు అందుకునే కౌలు రైతులు చాలా తక్కువ. అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలే వారికి దిక్కు. వారికి ఎటువంటి రాయితీలు లభించవు. కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు, జేఎల్జీలు (జాయింట్ లయబిలిటీ గ్రూపులు-‘భూమి హీన్ కిసాన్’) ఉన్నప్పటికీ, మొత్తం వ్యవసాయ రుణంలో కౌలు రైతులకు అందేది కేవలం 3% మాత్రమే. ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేని కారణంగా కౌలు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా సహా దాదాపు అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు అనర్హులు. కరువు, అధిక వర్షాలు, వర్షాభావం, నాణ్యత లేని విత్తనాలు, అధికమవుతున్న సాగు ఖర్చులు, మార్కెట్లో మోసాలు, అవకతవకలు వంటి నిత్య సమస్యలు కౌలు రైతు మీద విపరీత ప్రభావం చూపుతాయి. వారి సున్నితమైన ఆర్థిక ప్రణాళికలు చిన్నాభిన్నం అవుతాయి. ప్రభుత్వానికి చెప్పుకుందామంటే వారికి అధికారుల దృష్టిలో గుర్తింపు లేదు. రైతు సంఘాల సానుకూల దృష్టి కూడా అంతంతమాత్రమే.
కౌలురైతు లేనిదే వ్యవసాయం లేదు
భూమి చేతులు మారుతున్నది. వ్యవసాయ భూమి వ్యవసాయం మీద ఆధారపడని వ్యక్తుల యాజమాన్యంలో ఉండడంతో వ్యవసాయం కొనసాగడం కౌలు రైతుల మీదనే ఆధారపడి ఉన్నది. కౌలు భూముల విస్తీర్ణం పెరుగుతున్నది. కౌలు రైతుల కష్టాలు పెరుగుతున్నాయి. కౌలు రైతులను ప్రభుత్వ పథకాల లబ్దిదారులను చేయడం కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కొంత ఉపశమనం కలుగుతుంది. కౌలు రైతులకు బాసటగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలవాలి. వ్యవసాయ భూమి తగ్గితే ఆహార ఉత్పత్తి తగ్గుతుంది. ఆర్థిక రంగం మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యవసాయ భూమిని కాపాడుకునే ప్రక్రియలో భాగంగా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత.