- సాంకేతిక సమస్యలతో కొంత మందికి రుణ మాఫీ కాలేదు
- వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రైతు రుణమాఫీ కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతిక సమస్యలతో కొంత మంది రైతులకు రుణమాఫీ కాలేదనే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ గుర్తించిందని తెలిపారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులను పరిష్కరించామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల లోపు రుణ మాఫీ చేసింది తమ ప్రభుత్వమేనని, దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో రుణమాఫీ జరగలేదని పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులు చనిపోతే బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ఎప్పుడు మోసం చేయదని, అర్హులైన రైతులందరికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దివాలా తీసిన విదేశీ కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని అప్పగించిందని, ఇప్పుడు దానిని ఎన్ఐసీకి అప్పగించామన్నారు. త్వరలోనే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు. ఆర్వోఆర్ చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై చాలా మంది మేధావులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల సలహాలు తీసుకున్నామని వెల్లడించారు.