జనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి

జనగామ జిల్లాలో విత్తనాల కొరత లేకుండా చూడాలి : బి. గోపి

జనగామ అర్బన్, వెలుగు: క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించాలని, గ్రామ స్థాయిలో ప్రతిరోజూ అధికారులు విత్తన డీలర్​ కేంద్రాలను పర్యవేక్షించి ఎరువుల కొరత లేకుండా చూడాలని, ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తిచేయాలని  ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ డైరెక్టర్​ బి. గోపి అన్నారు.  మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని గానుగుపహాడ్​ గ్రామంలోని రైతు వేదికలో జిల్లా కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​తో కలిసి అయన అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి వానాకాలం పంటపై రివ్యూ నిర్వహించారు.   

గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు విత్తనాలు, ఎరువుల కేంద్రాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విడి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదన్నారు.  క్షేత్రస్థాయిలో రైతులకు విత్తనాలు, ఎరువులపై షార్ట్​ ఫిల్మ్​ ద్వారా పల్లెల్లో రైతు సమావేశాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి,  అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  ఈ రివ్యూలో ఆర్డీవో వెంకన్న, డీఏవో వినోద్​ కుమార్, డీసీఎస్​వో రోజారాణి, డీఎం సీఎస్​ ప్రసాద్​, తహసీల్దార్​ వెంకటేశం, డీటీలు శ్రీనివాస్​, దేవా, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలుంటే  దృష్టికి తీసుకురావాలి

వర్థన్నపేట : కొనుగోలు కేంద్రాల్లో  రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని,  మార్కెట్లో​ ఉన్న ధాన్యం  కొనుగొళ్లను వేగవంతం చేయాలని  సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్​, వరంగల్​ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్ పి. గోపీ అన్నారు. మంగళవారం వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ కమిటీ  ఐకేపీ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని   పరిశీలించారు.

జూన్ మొదటి వారంలోగా  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందశాతం కొనుగోళ్లు పూర్తి కావాలని,ధాన్యం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తూ  అమ్మిన రైతులకు సత్వరమే డబ్బులు అందేలా చూడాలన్నారు.  కార్యక్రమంలో డీఆర్డీఓ  కౌసల్య దేవి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయల్,  జిల్లా పౌరసరఫరాల అధికారి శివ ప్రసాద్ రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యా రాణి  పాల్గొన్నారు.