- సుమారువెయ్యి కోట్ల వరకు నష్టం
- ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయ శాఖ
- వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు
- చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
- ఖమ్మం, మహబూబాబాద్‌లో
- తీవ్ర నష్టందెబ్బతిన్న పత్తి, మిర్చి, వరి పంటలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వివిధ దశల్లో ఉన్న పంటలన్నీ నీట మునిగాయి. కొన్ని జిల్లాల్లో వరద ధాటికి మొక్కలన్నీ కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో పెట్టిన పెట్టుబడి.. చేసిన కష్టం వానపాలైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.
Also Read:-వరద బాధితులకు అండగా ఉంటాం
దాదాపు రూ.800 కోట్ల నుంచి రూ.1,000 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 4.08 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. సోమవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ శాఖ అధికారులు ముంపు ప్రాంతాలను సందర్శించారు.
ఉప్పొంగిన వాగులు, చెరువులు
రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగాయి. దీంతో కిలో మీటర్ల మేర వరద ప్రవాహం.. పంటలను ముంచెత్తింది. చాలా వరకు పంటలు తుడిచిపెట్టుకుపోయినట్లు క్షేత్ర స్థాయి అధికారులు చెప్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 25వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అంచనా వేశారు. 15వేల ఎకరాల్లో వరి, 4,867 ఎకరాల్లో పత్తి, 1,941 ఎకరాల్లో మక్కలు, 1,756 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరి పొలాలు చాలా వరకు నీట మునిగాయి. మిర్చి పంట కూడా దెబ్బతిన్నది. మున్నేరు వాగు ఉప్పొంగడంతో పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో సాగైన 3.32 లక్షల ఎకరాల పంటల్లో చాలా వరకు నీట మునిగాయి.
పంటలన్నీ ప్రాథమిక దశలోనే..
వానాకాలం సీజన్లో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే 1.09 కోట్ల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. 42.66 లక్షల ఎకరాల్లో పత్తి, 4.60 లక్షల ఎకరాల్లో కంది, 66వేల ఎకరాల్లో పెసర పంటలు వేశారు. మొత్తం 5.48 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాలు సాగు చేశారు. 4.88 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 47.81 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. ఈ పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి. భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగాయి.
విద్యుత్ పునరుద్ధరణ చర్యలు స్పీడప్
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. సదరన్ డిస్కం పరిధిలో 2,417 కరెంట్ పోల్స్, 21 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్ట్రక్చర్లు, 18 సబ్ స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం జరిగింది. కరెంట్ తీగలపై చెట్లు పడటం, వరద ప్రవాహానికి 1,200కు పైగా కరెంట్ పోల్స్ విరిగిపోయాయి. ఇదే జిల్లా నాలుగు సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా, జీహెచ్ఎంసీ పరిధిలో 412 విద్యుత్ స్తంభాలు, 13 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ తెలిపారు. నార్తర్న్ డిస్కం పరిధిలో కూడా విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది. ముంపు గ్రామాల్లో కరెంట్ సప్లై నిలిచిపోయింది. మూడు 33/11 కేవీ సబ్ స్టేషన్లలోకి వరద నీరు చేరింది. దీంతో అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపడ్తున్నారు. భారీ వర్షంలోనూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎంతో బాగా పని చేసిందని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు. రెండు డిస్కమ్ జిల్లాలు, సర్కిళ్ల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండెంట్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యక్తిగతంగానూ జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.