- అధ్యయనానికి మధ్యప్రదేశ్‌కు రాష్ట్ర అధికారుల బృందం
- కచ్చితత్వం కోసమే ఏఐ వినియోగం
- రైతు యూనిట్‌గా పంటల బీమా
హైదరాబాద్, వెలుగు : పంటల బీమా పథకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ లో అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారంలో అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి అక్కడ అమలు చేస్తున్న తీరును స్టడీ చేయనున్నారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు మ్యాన్యువల్‌గా పంట నష్టాన్ని అంచనా వేస్తూ వస్తున్నారు. కానీ, బీమా సంస్థలు, అగ్రికల్చర్ అధికారులు పారదర్శకంగా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఒకవైపు మ్యాన్యువల్ చేపడుతూనే మరోవైపు ఏఐ టెక్నాలజీని వినియోగించి పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇలా నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమాను రాష్ట్రంలో అమలు చేయాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి 14 అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలతో రాష్ట్ర అగ్రికల్చర్ ఆఫీసర్లు పలు మార్లు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పంట బీమా ఎలా అమలు చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఒక్క రైతుకు పంట నష్టం జరిగినా పరిహారం..
గతంలో పంట బీమా అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్‌గా వివిధ రకాలుగా పంట లను బట్టి పంట బీమా అమలులో ఉండేది. దీనికి భిన్నంగా ఇప్పుడు ఒక్క రైతుకు ఎకరం పంట నష్టం జరిగినా పంట బీమా పరిహారం అందుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఎవరైనా వ్యక్తికి యాక్సిడెంట్ జరిగితే పరిహారం ఎలా వస్తుందో అదే విధంగా పంట నష్టం జరిగిన రైతుకు కూడా పరిహారం అందాలనే దానిపై సర్కారు యోచిస్తోంది. రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా అమలు చేయనున్నారు.
బీమా ప్రీమియం అంచనా రూ.2,500 కోట్లు
రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా అమల్లో ఉన్నప్పుడు 10 లక్షల లోపు రైతులే క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకునే వారు. తాజాగా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీమా పరిధిలోకి వచ్చే రైతులు 50 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని అధికారులు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే విధంగా బీమా ప్రీమియం రూ.2,500 కోట్ల మేరకు ఉండొచ్చని చెప్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ పంటవేసినప్పటి నుంచి కోత వరకు ఎప్పుడు పంట నష్టం జరిగినా, దిగుబడి తగ్గినా బీమా కవర్ చేయనుంది. ప్రకృతి విపత్తులతో వానలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడం, సాగునీటి వసతి లేక పంటలు సాగు చేయకుంటే అలాంటి రైతులకు కూడా పంటనష్ట పరిహారం అందించే విషయంపై ప్రభుత్వం యోచిస్తోంది.