
- సెంటర్లకు 4.50 లక్షల టన్నులు
- మిల్లర్లు 2.50 లక్షలు కొంటారని అగ్రికల్చర్ అంచనా
- 70 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు
- 280 పైగా సెంటర్లు ఏర్పాటు
- యాసంగి వడ్ల కొనుగోళ్లపై ఆఫీసర్ల కసరత్తు
యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్లో వడ్ల దిగుబడి భారీగా వస్తుందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. ఎకరానికి 25 నుంచి 26 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తుందని లెక్కలు వేసింది. కొనుగోళ్ల విషయంలో ఆఫీసర్లు కసరత్తు ప్రారంభించారు. గన్నీ బ్యాగుల ఇండెంట్తోపాటు ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలన్న అంశంపై లెక్కలు వేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 2024–-25 యాసంగి సీజన్లో ఎప్పటిలాగే వరి సాగుకే రైతులు ప్రియారిటీ ఇచ్చారు. జిల్లావాప్తంగా 2.75 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారని పంటల నమోదు ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్లు లెక్కలు వేశారు. అయితే ఈ సీజన్లో ఒక్కో ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని లెక్కలు వేశారు. ఈ లెక్కన సాగు చేసిన 2.75 లక్షల ఎకరాల్లో 7 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
సెంటర్లకు 4.50 లక్షల టన్నులే..
ఈ సీజన్లో ఎక్కువగా దొడ్డు రకం పండిస్తున్నందున, ఆ వడ్ల కొనుగోలులో మిల్లర్లు ముందస్తుగా ప్లానింగ్ చేసుకుంటున్నారు. దిగుబడి 7 లక్షల టన్నులకు పైగా వస్తున్నా.. దీనిలో 2 లక్షల టన్నుల నుంచి 3 లక్షల టన్నుల వరకు మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేశారు. అమౌంట్ వెంటనే ఇస్తున్నందున రైతులు కూడా మిల్లర్ల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. కాగా మిల్లర్లు కొనుగోలు చేసినా.. సివిల్సప్లయ్ ఏర్పాటు చేసే కొనుగోలు సెంటర్లకు 4.50 లక్షల టన్నులు వస్తాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు
చెబుతున్నారు.
70 లక్షలకు పైగా గన్నీలు..
వడ్ల కొనుగోలుపై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. దిగుబడి 7 లక్షల టన్నులు వస్తున్నా.. కొనుగోలు సెంటర్లకు వచ్చే వడ్ల కోసం సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎంతమేరకు గన్నీ బ్యాగులు అవసరమో లెక్కలు వేస్తున్నారు. సెంటర్లకు 4.50 లక్షల టన్నులే వస్తాయని అంచనా వేస్తున్నందున, 70 లక్షలకు పైగా గన్నీ బ్యాగులు అవసరం పడుతాయని సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లెక్క వేసింది. 280 నుంచి 300 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్లానింగ్వేస్తోంది. ఇప్పటికే మిల్లర్లతో ఆఫీసర్లు మీటింగ్నిర్వహించారు. వడ్లను స్టాక్చేయడానికి వీలుగా అవసరమైన ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా ఈనెల 11న వడ్ల కొనుగోలు ఏజెన్సీలతో ప్రత్యేకంగా మీటింగ్ నిర్వహించనున్నారు.