హామీ తప్పనిసరి .. సబ్సిడీ పనిముట్లను ఇతరులకు అమ్మబోమని హామీ పత్రం

హామీ తప్పనిసరి ..  సబ్సిడీ పనిముట్లను ఇతరులకు అమ్మబోమని హామీ పత్రం
  • మహిళలకే సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం 
  • ఇతరులకు 40 శాతం సబ్సిడీ 
  • సబ్సిడీలో కేంద్ర వాటా 60, రాష్ట్ర వాటా 40 శాతం
  • ఉమ్మడి జిల్లాకు 1,552 యూనిట్లు 

యాదాద్రి, వెలుగు : లబ్ధిపొందే వారి నుంచి అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​ హామీ పత్రం తప్పనిసరి చేసింది. 'సబ్సిడీపై తాము పొందే పరికరాలను ఇతరులకు అమ్ముకోము' అని హామీ ఇచ్చేలా అప్లికేషన్​ ఫారాన్ని తయారు చేసింది. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సాహించడంతోపాటు మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకే మహిళలకు ఎక్కువ సబ్సిడీపై యంత్రాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. 

ఉమ్మడి జిల్లాకు 1,552 యూనిట్లు..

రైతుబంధు అమలుతో అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. వ్యవసాయ పరికరాలతో విత్తనాలకు సబ్సిడీ ఇవ్వడం నిలిపివేసింది. ఏడేండ్ల తర్వాత తిరిగి ఈ వ్యవసాయ పనిముట్లను సబ్సిడీతో ఇవ్వడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్​లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు 1,552 యూనిట్లు మంజూరయ్యాయి. రూ.3.59 కోట్లు కేటాయించారు. నల్గొండకు 820 యూనిట్లు మంజూరు కాగా, రూ.1.81 కోట్లు,  సూర్యాపేటకు 457 యూనిట్లకు 1.06 కోట్లు, యాదాద్రి జిల్లాకు 275 యూనిట్లు మంజూరు కాగా రూ.72.05 లక్షలు కేటాయించారు. 

మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ..

మహిళల భాగస్వామ్యం పెంచడంలో భాగంగా వారికే ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో పనిముట్లను అందించేవారు. ఈసారి మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తారు. మహిళ పేరుపై భూమి లేకున్నా.. భర్త లేదా తండ్రి పేరుతో భూమి ఉంటే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. భూస్వాములు, పెద్ద రైతులకు 40 శాతం సబ్సిడీతో అందిస్తారు. అంటే రూ.లక్ష విలువైన యూనిట్ కోసం మహిళ, ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు రూ.50 వేలు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులకు అయితే రూ.60 వేలు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు అందించే సబ్సిడీలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించనుంది. 

ఎంపికకు మండల, జిల్లా కమిటీలు..

లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా, మండల కమిటీలను నియమించారు. రూ.లక్ష విలువైన పనిముట్లకు లబ్ధిదారుడి ఎంపిక మండల కమిటీ చూసుకుంటుంది. ఈ కమిటీలో ఎంఈవో కన్వీనర్​గా ఉండగా, తహసీల్దార్, ఎంపీడీవో మెంబర్లుగా ఉంటారు. రూ.లక్షకు పైబడిన పనిముట్ల లబ్ధిదారుల ఎంపిక జిల్లా కమిటీ చూసుకుంటుంది. జిల్లా కమిటీకి చైర్మన్​గా కలెక్టర్​వ్యవహరిస్తారు. కన్వీనర్​గా జిల్లా వ్యవసాయ ఆఫీసర్, మెంబర్లుగా ఎల్ డీఎం, టీఎస్​ ఆగ్రో, డాటా సెంటర్ నుంచి ఒక్కొక్కరు మెంబర్లుగా ఉంటారు. పనిముట్ల కోసం అప్లయ్ చేసుకునే వారు తమ డీడీలను మండల కమిటీలకు అందించాల్సి ఉంటుంది. 

14 రకాల పరికరాలు..

వ్యవసాయ పనుల్లో రైతులకు దోహదపడే 14 రకాల పరికరాలను సబ్సిడీతో ప్రభుత్వం అందించనుంది. స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, డ్రోన్లు, రోటో వేటర్లు, విత్తనాలు, ఎరువులు వేసే పరికరాలు, పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్, ట్రాక్టర్లు, మొక్కజొన్న కోత పరికరాలు, గడ్డిచుట్టే వంటి పరికరాలు ఉన్నాయి. 

ఇతరులకు  అమ్మబోమని హామీ పత్రం..

సబ్సిడీపై ఇస్తున్న పనిముట్లు పక్కదారి పట్టకుండా అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​ముందస్తుగా చర్యలు చేపట్టింది. పనిముట్ల కోసం అప్లికేషన్​ పేపర్​లోనే ప్రత్యేకంగా హామీ పత్రం కాలమ్ రూపొందించింది. ఈ కాలమ్​లో తాను పొందిన యూనిట్​ను ఇతరులకు విక్రయించనని అప్లికెంట్ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సబ్సిడీ పరికరాలను ఇతరులకు అమ్మినట్టయితే తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది.