రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురూ..టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు

 రుణమాఫీపై  ఫీల్డ్ సర్వే షురూ..టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు
  • కుటుంబ నిర్ధారణ మొదలు
  • ఆధార్ కార్డు వివరాల సేకరణ 
  • రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్​లో 4.24 లక్షల అకౌంట్లు
  • నాలుగు రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కుటుంబ సభ్యుల నిర్ధారణ కాకుండా ఆగిపోయిన రుణమాఫీ ప్రక్రియను అగ్రికల్చర్ శాఖ స్పీడప్ చేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిలో ఫ్యామిలీ నిర్ధారణ కాకుండా నిలిచిపోయినవే ఎక్కువ ఉన్నట్లు అధికారులు చెప్తున్నరు. రాష్ట్రవ్యాప్తంగా 4,24,873 క్రాప్ లోన్ అకౌంట్లు పెండింగ్​లో ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులు పంపిన జాబితా ఆధారంగా అగ్రికల్చర్ ఆఫీసర్లు (ఏవో) లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామాల వారీగా ప్రతి ఇంటికీ వెళ్తున్నారు.

Also Read:-డ్రగ్స్, గంజాయి​ వాడితే దొరుకుడు పక్కా!

బుధవారం నుంచి క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభించి వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేకుండా ఫ్యామిలీ నిర్ధారణ కాని లిస్టులో ఉన్నవారందరి ఇంటికెళ్లి గుర్తింపు ప్రక్రియ చేపడ్తున్నరు. జాబితాలో ఉన్న పేర్ల వారీగా పరిశీలించి లబ్ధిదారుల ఆధార్ కార్డులను సేకరిస్తున్నారు. రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ముగ్గురికి క్రాప్​లోన్ ఉంటే వారందరినీ ఒకే ఫొటో తీసుకుని వారి వివరాలన్నీ యాప్​లో ఒకే ఐడీలో ఎంటర్ చేసి అప్​లోడ్ చేస్తున్నారు. కుటుంబాలను సందర్శించినట్లు ఏవోలు సెల్ఫీలు తీసుకుంటున్నరు. పెండ్లై వేర్వేరు కుటుంబాలుగా ఉంటున్న వారి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నట్లయితే వేరుపడిన కుటుంబాన్ని కూడా ఒక ఫ్యామిలీగానే గుర్తిస్తున్నామని అధికారులు చెప్తున్నరు.

ఏ రోజుకు ఆ రోజు డేటా అప్​లోడ్

ఫ్యామిలీ నిర్ధారణ ప్రక్రియ నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని ఏవోలకు అధికారులు ఆదేశించారు. ఒక్కో మండలంలో సగటున నాలుగైదు వందల కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ చేయాల్సి ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా లిస్టులు అందించి వివరాలు సేకరిస్తున్నరు. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్​రావు, డైరెక్టర్ గోపీ క్షేత్రస్థాయి అగ్రికల్చర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్​కు అనుగుణంగా కుటుంబ నిర్ధారణ ప్రక్రియ చేపట్టే కార్యక్రమాన్ని ఏవోలు వేగవంతం చేశారు. ఏ రోజుకారోజు పోర్టల్​లోని ప్రత్యేక యాప్​లో వివరాలు అప్​లోడ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రానికల్లా నిర్ధారణ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్​గా పెట్టుకున్నరు.