హైదరాబాద్, వెలుగు: వ్యవసాయశాఖలో ‘డిజిటల్’ వార్ పెనుదుమారం లేపుతున్నది. తాజాగా మంగళవారం వ్యవసాయశాఖ 162 మంది అగ్రిలక్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో)లపై సస్సెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఏఈవోలు డిజిటల్ సర్వే చేయలేమని చేతులెత్తేసి 29 రోజులుగా పెన్‌డౌన్ చేస్తున్నారు. తాజాగా డిజిటల్సర్వే చేయడం లేదనే సాకుతో 163 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్‌రావు ఆదేశాల మేరకు డైరెక్టర్ గోపీ మంగళవారం వ్యవసాయశాఖలో పని చేస్తున్న 163 మందిని సస్పెండ్ చేశారు. ఇతర కారణాలు చెబుతున్నప్పటికీ ప్రధానంగా డిజిటల్ సర్వే యాప్ డౌన్ లోడ్ చేసుకొని సర్వే చేయలేదనే నెపంతోనే సస్పెన్షన్ వేశారని ఏఈవోలు ఆరోపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్క్రాప్ సర్వే చేయాలంటే సహాయకులను ఇవ్వాల్సిందేనని అన్నారు. అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్‌రావు తన కొడుకు, అల్లుడి సంస్థల ద్వారా యాప్‌లు తయారు చేయించి కోట్లాది రూపాయలు మెయింటెనెన్స్చెల్లిస్తూ ఆ యాప్‌లను తమపై రుద్దుతూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అగ్రికల్చర్ సెక్రటరీ కొందరు నేతల అండ చూసుకుని తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే క్రాప్ సర్వే, రైతు బీమా, రైతు భరోసాతో పాటు 49 రకాల సేవలు చేస్తున్నా.. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి అగ్రికల్చర్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేశారు. సహాయకులను ఇవ్వాల్సిందిగా కోరినా ఇవ్వకుండా తమతో అడ్డగోలు చాకిరీ చేయిస్తూ బానిసల్లా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామనీ, ఇకపై సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఉండాల్సి ఉండగా ఒక్కో ఏఈవోకు పది వేల ఎకరాలకు పైగా ఉన్నాయనీ, ట్యాబ్‌లు ఇచ్చి పదేండ్లయిందనీ, అవి పని చేయడం లేదన్నారు. రైతు వేదికల్లో అటెండర్ లాగా, ప్రభుత్వ పథకాల్లో డీటీపీ ఆపరేటర్లుగా అన్ని తామే అయి పని చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సస్పెన్షన్ ఎత్తివేసే వరకు నో డ్యూటీ
ఏఈవోలపై సస్పెన్షన్ ఎత్తివేసే వరకు విధులకు హాజరు కాబోమని ఏఈవోల జేఏసీ ప్రకటించింది. డీసీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకోనందుకు రాష్ట్రంలో 163 మంది ఏఈఓ లను సస్పెన్షన్ చేశారని ఆరోపించింది. సస్పెన్షన్ లో భాగంగా అన్యాయానికి గురైన రాష్ట్ర అడహక్ కమిటీ చైర్మన్ బాధావత్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏఈవోలు వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి చేరుకోగా కలిసేందుకు డైరెక్టర్ నిరాకరించారని వారు తెలిపారు. ఈ సదర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ సస్పెన్షన్ ఎత్తేసే వరకు రాష్ట్రంలో ఏఈవోలు ఎవరూ విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత ఏడీఏలకు మాస్ లీవ్ లెటర్లు ఇచ్చామని తెలిపారు. అలాగే అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ధర్నా చేసి పెద్ద ఎత్తన నినాదాలు చేశారు.