పాలమూరు జడ్పీ మీటింగ్‌లో ఆఫీసర్లపై సభ్యుల ఫైర్
మహబూబ్‌నగర్, వెలుగు : ‘ఏడాదిన్నరలో మూడు సార్లు సమావేశం జరిగింది. ఈ మూడు సార్లు తాగునీరు, వ్యవసాయానికి సంబంధించి సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చాం. వాటికి ఇప్పటి వరకు పరిష్కారం చూపుతలేరు. కొత్త సమస్యల గురించి చెప్పి ఏం లాభం’ అని జడ్పీ మీటింగ్‌లో ఆఫీసర్లపై సభ్యులు ఫైర్ అయ్యారు. జడ్పీ హాల్లో చైర్పర్సన్ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ జి రవి నాయక్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతు బీమా నమోదులో ఫెయిల్..
సమావేశంలో ముందుగా అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌పై చర్చించారు. ఏడీఏ వెంకటేశ్వర్లు గైర్హాజరుకావడంతో ఆరు నెలలకోసారి జరిగే సమావేశానికి ఆఫీసర్లు రాకుంటే ఎట్లా అని? సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్ మాట్లాడుతూ గ్రామాల్లో చాలా మంది రైతులకు రైతుబంధు అందలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. కొందరికి అకౌంట్లలో డబ్బులు పడినా, బ్యాంకర్లు అప్పు కింద జమ చేసుకుంటున్నారని చెప్పారు. రైతుబీమా నమోదు చేయడంలోనూ విఫలమయ్యారని గరం అయ్యారు. వడ్ల సెంటర్ల ఏర్పాటులో సమస్యలు రాకుండా చూడాలని కోరారు.
వెటర్నరీ హాస్పిటల్స్‌లో టాయిలెట్స్ లేవు..
మూసాపేట మండలం కేంద్రంతో పాటు వేముల వద్ద ఉన్న వెటర్నరీ హాస్పిటళ్లు శిథిలావస్థకు చేరాయని జడ్పీటీసీ సభ దృష్టికి తెచ్చారు. ఫతేపూర్ వద్ద నాలుగు తండాలు, ఐదు గ్రామాలున్నాయని, ఇక్కడ ఒక సెంటర్‌ను ఏర్పాటు చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీపీ సుధశ్రీ కోరారు. జిల్లాలో 70 వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటే అందులో 45 హాస్పిటళ్లలో టాయిలెట్స్ లేవన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ లేదంటే ఇతరత్రా ఫండ్స్ కేటాయించాలని కోరారు.
3 రోజుల్లో సమాధానం ఇవ్వాలి
అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు సభ్యులు లేవనెత్తిన సమస్యలకు సమాధానం చెప్పాలని జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి ఆదేశించారు. సమావేశం దృష్టికి వచ్చిన సమస్యలను నోట్ చేసుకొని 3 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ఆఫీసర్లే డైరెక్ట్‌గా సంబంధిత సభ్యులకు మెసేజ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు.
- డీఆర్డీఏ గురించి చర్చకు రాగా.. సీసీ రోడ్లకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు రావడం లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. వితంతు పింఛన్ల కోసం అప్లై చేసుకున్నా, మంజూరు చేయడం లేదన్నారు.
- హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై చర్చ జరుగగా మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు పల్లె దవాఖానకు డాక్టర్‌ను నియమించాలని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు కోరారు. ఇక్కడ పని చేస్తున్న వారిని మారుస్తున్నారని, మంత్రి చెబితే తప్ప డాక్టర్‌ను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- మిషన్ భగీరథపై చర్చ జరగగా, బాలానగర్ మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని జడ్పీటీసీ కల్యాణి సభ దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే ఆఫీసర్లు ఫ్యాక్టరీలకు భగీరథ నీళ్లు తరలిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూసాపేట, బాలానగర్, చిన్నచింతకుంట మండలాల్లోని కొన్ని ఏరియాల్లో ట్యాంకుల్లోకి నీళ్లు ఎక్కడం లేదని, దీంతో తాగునీటి సప్లై జరగడం లేదని సభ దృష్టికి తెచ్చారు.
- బీసీ వెల్ఫేర్ సంబంధించిన నివేదిక చదువుతుండగా, మంత్రి జోక్యం చేసుకుని దేవరకద్రలో ఉన్న బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ పిల్లలను ఎందుకు హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారని ప్రశ్నించారు. ఈ కాలేజీని ఎక్కడికి తరలించరాదని, ఇక్కడే కొనసాగించాలని ఆదేశించారు. స్టడీ సర్కిళ్లు, జూనియర్ కాలేజీల గురించి మంత్రి ప్రశ్నించారు. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఈ సారి పూర్తి వివరాలతో రావాలని సూచించారు.
కర్వెనను అందుబాటులోకి తెస్తాం..
కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు 80 శాతం పూర్తయ్యాయని, డిసెంబర్ చివరి నాటికి కర్వెన ద్వారా సాగునీటిని అందిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నింపే అవకాశం ఉండేదని, భవిష్యత్తులో కోయిల్‌సాగర్ నుంచే జూరాలకు రివర్స్ పంపింగ్ చేసే అవకాశం రాబోతుందన్నారు. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు నుంచి మైసమ్మ వరకు అడవిలో 13 కిలోమీటర్ల మేర జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తామన్నారు. గోల్ బంగ్లా వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఫతేపూర్ మైసమ్మ దేవాలయం కోసం అటవీ శాఖ నుంచి పది ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని, అందుకు బదులుగా వెంకటాపూర్ గ్రామం వద్ద 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈజీఎస్ కింద చేపట్టిన పనులు, ఫండ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని డీఆర్డీవో యాదయ్యను కోరారు. గిరి వికాసం కింద మంజూరైన బోర్లపై దృష్టి పెట్టాలని కోరారు. సీసీ రోడ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులు, అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ శివకుమార్‌ను కోరారు.