రామాయంపేట సొసైటీకి అగ్రికల్చర్​ డ్రోన్​ 

రామాయంపేట సొసైటీకి అగ్రికల్చర్​ డ్రోన్​ 

రామాయంపేట, వెలుగు: డ్రోన్ సేవలను  రైతులు ఉపయోగించు కోవాలని రామాయంపేట ఇన్​చార్జి ఏడీఏ రాజ్ నారాయణ సూచించారు. రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఇఫ్కో సంస్థ రూ.18 లక్షల విలువ గల డ్రోన్, ఆటో ట్రాలీని అందించింది. జిల్లాలోనే మొట్ట మొదటగా పంటలకు పురుగు మందుల పిచికారీ కోసం రామాయంపేటలో డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు సంబంధించి మండలంలోని శివాయిపల్లికి చెందిన యువ రైతు శ్రీకాంత్ కు కంపెనీ శిక్షణ ఇచ్చింది.

ఈ క్రమంలో ఇఫ్కో సంస్థ అధికారులు శనివారం రామాయంపేట పీఏసీఎస్ కు డ్రోన్​, ట్రాలీ ఆటోలను అందజేశారు. ఏడీఏ రాజ్ నారాయణ దాని పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు  టెక్నాలజీని ఉపయోగించు కోవాలన్నారు. ఈ డ్రోన్​తో కూలీల కొరత తప్పడమే కాకుండా, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు పిచికారీ చేయవచ్చన్నారు. అలాగే రైతులు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాదే చంద్రం, సీఈవో పుట్టి నర్సింలు, సుధాకర్ రెడ్డి ఉన్నారు.