విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయి

వ్యవసాయం గాలిలో దీపమై.. రైతు జీవితం చివురుటాకులా మారింది. కాలంకాని కాలంలో గాలొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా అటు పొలంలోనో, ఇటు మార్కెట్లోనో ఉన్న పంట నీళ్ల పాలవుతోంది. ఆరుగాలం శ్రమించిన రైతు లబోదిబోమంటున్నాడు. దీనికి తోడు విత్తన కంపెనీలు రైతులను మోసం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.

వ్యవసాయయే రైతుల జీవనాధరమైన మనదేశంలో అన్నదాతకు సేద్యం ఎప్పుడూ నిరాశనే మిగులుస్తోంది. రైతులను మినహాయిస్తే వ్యవసాయ ఉత్పత్తులపై ఆధారపడిన దళారులు, వ్యాపారులు వంటి వర్గాలన్నీ లాభాల బాటలోనే సాగుతున్నాయి. విత్తన కొనుగోలు నుంచి మార్కెట్లలో పంట విక్రయించడం వరకూ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా సమగ్ర చట్టాలు లేకపోవడం పెద్ద లోపం. విత్తన చట్టమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వరంగ విత్తన సంస్థలు రంగంలో ఉన్నప్పుడు రూపొందించిన నిబంధనలే, ప్రైవేటు రంగం విస్తరించిన కాలంలోనూ ఆచరణలో ఉండటం రైతుల ప్రయోజనాల్ని బలిపెట్టడమే. వ్యవస్థలోని లోటుపాట్లు రైతుల హక్కుల్ని కాలరాస్తున్నా దశాబ్దాలుగా చోద్యం చూసిన పాలకులు.. అధికారులు కొత్త విత్తన చట్టం రూపకల్పన వైపు త్వరితంగా అడుగులు వేయడం అవసరం. ఇక పత్తి విత్తన సాగు పేరిట రాజకీయ దళారులు, ఆర్గనైజర్లు, కంపెనీలు  రైతులను దోపిడీ చేస్తున్నాయి. కంపెనీలు, వాటికి దళారులుగా వ్యవహరించే ఆర్గనైజర్లు, రాజకీయ నాయకుల చేతుల్లో విత్తన రైతులు విలవిల్లాడుతున్నారు. పెట్టుబడి కింద అప్పులు ఇవ్వడం నుంచి వాటికి అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, లెక్కలు తేల్చకుండా రైతులను ఆగం చేస్తున్నరు. 

60 శాతం తెలంగాణ నుంచే..

తెలంగాణ రాష్ట్రంలో 228 కోట్ల ప్యాకెట్ల పత్తి విత్తనోత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. దాదాపు 27 కంపెనీలు విత్తన పత్తిని రైతులతో సాగు చేయిస్తున్నాయి. దేశంలోనే విత్తన పత్తి అత్యధికంగా సాగయ్యే గద్వాల జిల్లాతోపాటు, రాష్ట్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ తదితర పలు జిల్లాలు ఉన్నాయి. దేశానికి అవసరమైన పత్తి విత్తనాల్లో 60శాతం విత్తనం తెలంగాణ రాష్ట్రం నుండే సాగు అవుతోందని వ్యవసాయ శాఖ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. పత్తి విత్తనాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా 400 విత్తన కంపెనీలు, విత్తనోత్పత్తి, ప్రాసెసింగ్, గ్రేడింగ్, స్టోరేజ్ చేపడుతున్నాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే విత్తన పత్తిలో రాష్ట్రం వాటా ప్రధానంగా గద్వాల జిల్లా వాటా సుమారు 30 శాతంగా ఉంది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో దాదాపు 45 వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పతి జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గద్వాల తదితర జిల్లాల్లో దాదాపు లక్ష మందికి పైగా రైతులు, కూలీలు, ఆర్గనైజర్లు, కంపెనీల్లో సిబ్బంది విత్తన పత్తినే ఆధారంగా పనిచేస్తున్నారు. కాగా రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో విత్తన పత్తిసాగు మొదలవుతుంది.

యథేచ్ఛగా ఆర్గనైజర్ల దోపిడీ..

పత్తి విత్తన పంట ఉత్పత్తిని అప్పగించిన తర్వాత కూడా ఆర్గనైజర్ల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. జిన్నింగ్ ఛార్జీలు కూడా రైతుల నుంచే వసూలు చేస్తారు. అంతేకాకుండా తూకంలోనూ చేతివాటం చూపిస్తారు. క్వింటాలుకు 7 కిలోల చొప్పున తరుగు కూడా తీస్తారు. వేరు చేసిన విత్తనాన్ని శుద్ధి చేసే  సమయంలో వాటిల్లో ఎక్కువ విత్తనాల్లో పనికి రాకుండా పోయాయని..  నాసిరకం అని రైతులను మోసం చేస్తారు. విత్తనాలు మొత్తం ప్యాకెట్ల నుంచి 10–-20 శాతం వరకు కోత కోస్తారు. అలాగే తరుగు పోగా వచ్చిన విత్తన ప్యాకెట్లకు రైతులకు ధరలను లెక్క కడతారు. ఒక్కో ప్యాకెట్​కు 450 రూపాయల నుంచి 490 రూపాయల వరకు విత్తన రైతులకు ఇచ్చేందుకు మొత్తం సొమ్మును కంపెనీలు ఆర్గనైజర్లకు ఇస్తాయి. కానీ ఆర్గనైజర్లు మాత్రం రైతులకు గరిష్టంగా 410 రూపాయలను చెల్లిస్తున్నారు. రైతులకు ఇచ్చే రేటు విషయంలో కూడా ఆర్గనైజర్లు అడ్డంగా వ్యవహరిస్తుంటారు. క్వింటా ధరలను కాటన్ మిల్లుల వద్ద ప్రదర్శించాల్సి ఉన్నా అది ఎక్కడా అమలు జరగడం లేదు. కానీ ఆర్గనైజర్లు సీజన్లో కనిష్టంగా ఏ రేటు ఉంటుందో అంతే చెల్లించి రైతులను అడ్డంగా దోచుకుంటారు. కాగా సాగుకు ముందే రైతుకు కంపెనీకి, రైతులకు ఆర్గనైజర్లకు మధ్య ఒప్పందాలు జరగాలి. పెట్టుబడి రుణం, వడ్డీ రేటు, విత్తన ప్యాంట్ ధరతో సహా అన్ని అంశాలను ఆ ఒప్పందంలో విధిగా పేర్కొనాల్సి ఉంటుంది. ప్రతీ లావాదేవీకి అధికారిక రశీదు ఉండాలి.  అసలు ఏ కంపెనీ ఏ రైతుతో ఎంత పత్తి  సాగు చేస్తోంది.. ఎన్ని విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి.. అనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలి. అయితే ఇవేమీ ఎక్కడా అమలు కావడం లేదు. గత ఏడాది కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే వివరాలు ఇవ్వగా మిగిలిన కంపెనీలు ఎటువంటి సమాచారం అందించ లేదు. ఒక్క గద్వాల జిల్లాలో విత్తన పత్తిపై ఏటా సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుందని అధికారిక అంచనా. ఇందులో ఆర్గనైజర్లు కంపెనీలు లాభపడుతున్నాయే తప్ప రైతులకు లాభం వచ్చిన సందర్భాలు కనిపించడం లేదు.

 రైతులకే హక్కులుండాలి..

విత్తనోత్పత్తి వ్యాపారంలోకి ప్రైవేటు కంపెనీలు విస్తృతంగా రాని రోజుల్లో కేవలం ప్రభుత్వ రంగ విత్తన సంస్థలే ఉన్న కాలంలో రూపొందించిన 1968 విత్తన చట్టమే నేటికీ చలామణీ అవుతుండటం గమనార్హం. విత్తనోత్పత్తి విషయంలో కంపెనీలు పలు అంశాలను రహస్యంగా ఉంచుతుంటాయి. విత్తనాల ఉత్పత్తి, ప్యాకింగ్, అమ్మకాల వివరాలను వ్యవసాయ శాఖకు తెలియజేయాలనే నిబంధనలు పాత చట్టంలోనే ఉన్నా ఆ శాఖ వద్ద సమాచారం లేదంటే- పర్య వేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో అర్థమవుతోంది. కొన్ని కంపెనీలు రైతులతో విత్తనోత్పత్తి చేయించే విషయంలో మధ్యవర్తులను పెట్టుకుంటాయి. దీనివల్ల పరిహారం సమయంలో మధ్యవర్తులు జారుకుంటే రైతులు అన్యాయం అవుతున్నారు. ఇలాంటప్పుడు మూడో పక్షంగా జిల్లా వ్యవసాయాధికారులు ఉండాలని రైతు సంఘాలు సూచిస్తున్నాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో కూడా కంపెనీలు ఒక రకానికి అనుమతులు తెచ్చుకుని అనధికారికంగా తదుపరి తరం విత్తనాలపై స్వేచ్ఛగా క్షేత్రస్థాయి ప్రయోగాలను నిర్వహిస్తున్నాయి. వీటిపై నిషేధం అమల్లో ఉన్నా చర్యలు లేవు.  స్వయంగా విత్తనోత్పత్తి చేసి విక్రయించుకునే విషయంలో ఎలాంటి బ్రాండ్ పేరు లేకపోయినా స్వేచ్చగా అమ్ముకునే సావకాశం రైతులకు ఉండాలి. రైతులు క్షేత్రస్థాయిలో వారి విత్తనాలను సాగు చేసినప్పుడు కంపెనీలు ప్రకటించిన లక్షణాల మేరకు అవి ఫలితాలనిచ్చాయా అనేది ముఖ్యం. ఈ విషయంలో తేడాలుంటే కంపెనీలపై చట్ట ప్రకారం చర్య తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉండాలి. దేశంలో విత్తనోత్పత్తి చేసే సంస్థ లేదా వ్యక్తుల కార్యకలాపాలు ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉండాల్సిన అవసరముంది. 

చట్టబద్ధమైన ఒప్పంద పత్రాలు లేకుండానే..

విత్తన పత్తి సాగు చేసే రైతులకు పెట్టుబడుల నిమిత్తం సంబంధిత కంపెనీలే 18 శాతం వడ్డీతో అప్పులు ఇస్తాయి. కానీ కంపెనీకి, రైతులకు మధ్య ఆర్గనైజర్లు పెట్టుబడులపై వడ్డీలు వసూలు చేస్తారు. ఇందుకు ఎలాంటి చట్టబద్ధమైన ఒప్పంద పత్రాలు ఉండవు. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులకు తెలిసినా పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. జూన్‌‌‌‌కు ఒకటి రెండు నెలల ముందే ఆర్గనైజర్లు రైతులకు పెట్టుబడి పేరు మీద అప్పులు ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతుంది. అప్పటి నుంచే వాటికి వడ్డీని లెక్కగడతారు. నవంబర్, డిసెంబర్ నెలల నాటికి పంట చేతికి వస్తుంది. రైతులు ఆ విత్తన పంటను ఆర్గనైజర్లకు అప్పగిస్తారు. అప్పటి వరకే వడ్డీ వసూలు చేయాలి.పెట్టుబడి పెట్టిన కంపెనీ కూడా ఆర్గనైజర్ల నుండి అప్పటి వరకే వడ్డీని వసూలు చేస్తుంది. కానీ ఆర్గనైజర్లు మాత్రం మళ్లీ సీజన్ ప్రారంభం అయ్యేంత వరకూ విత్తన ఉత్పత్తి లెక్కలు తేల్చకుండా నాన్చుతారు. ఇలా నెలల తరబడి తేల్చకుండా రైతుల వద్ద భారీగా వడ్డీలు వసూలు చేస్తారు.

రైతుల డిమాండ్

సీడ్ పత్తి రైతులు ప్రధానంగా రెండు డిమాండ్లు చేస్తున్నారు. ఒకటి ధరల పెంపు, మరొకటి వడ్డీ నెలల తగ్గింపు. వాస్తవంగా ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన అప్పులపై జూన్ నుంచి మే వరకు 12 నెలల వడ్డీ వసూలు చేస్తున్నారు. దీనిని ఆరు నెలలకు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ నెలలో పెట్టుబడులకు అప్పులు ఇస్తుండగా, పంట ఉత్పత్తులను డిసెంబర్​లో ఆర్గనైజర్లు స్వాధీనం చేసుకుంటున్నారు. కాబట్టి డిసెంబర్ వరకే వడ్డీని వసూలు చేయాలని రై తులు పట్టుబడుతున్నారు. ఆర్గనైజర్లు రైతుల డిమాండ్‌‌‌‌ను అంగీకరిస్తే ఏటా వారికి 
రూ.36 కోట్లు ఆదా అవుతాయి.
- మన్నారం నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు,తెలంగాణ లోక్​సత్తా పార్టీ