గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి: కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి: కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​

హైదరాబాద్, వెలుగు: పేదరికం లేని గ్రామం తన కల అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. గ్రామాల్లో అందరికీ ఉపాధి కల్పించి, పేదరికాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్​రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ( ఎన్ఐఆర్డీ )  66వ కౌన్సిల్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు కమలేశ్​పాశ్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి శివరాజ్ సింగ్ అటెండ్ అయ్యారు.  జేఎన్‌‌యూ, ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ), పీహెచ్‌‌డీకి సంబంధించి రెండు అవగాహన ఒప్పందాలపై   ప్రముఖుల సమక్షంలో సంతకాలు చేశాయి. 

గ్రామ్ రోజ్‌‌గార్ సేవక్ (జీఆర్ఎస్) కోసం ఆన్‌‌లైన్ కోర్సును కూడా  చౌహాన్  ప్రారంభించారు.  ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..  గ్రామ స్వరాజ్ అనేది మహాత్మా గాంధీ కల అని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తూ..  గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌‌పేయి 2000లో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్ వై)ని ప్రారంభిస్తే, వివిధ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ దూరదృష్టితో ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో  జల్ జీవన్ మిషన్ స్కీమ్ ఎంతో కీలకమైనదని, ఈ స్కీమ్ ద్వారా గ్రామ ప్రజలకు తాగు నీరు అందించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తున్నదని చెప్పారు.  

దేశ ఆర్థిక వ్యవస్ధలో మహిళలు,  మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. క్యాంపస్‌‌లోని రూరల్ టెక్నాలజీ పార్కును సందర్శించి, పీఎం ఆవాస్ యోజనలో భాగంగా 409  ఎస్ఎఫ్ టీలో రూ.4.04 లక్షల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ హౌస్​ ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృధ్ది శాఖ అధికారులు శైలేశ్​కుమార్ సింగ్, ఎన్ఐఆర్డీ డీజీ నరేంద్ర కుమార్, జేఎన్​యూ వీసీ శాంతి శ్రీ పాల్గొన్నారు.