అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు

అర్హులందరికీ రుణమాఫీ చేస్తం : తుమ్మల నాగేశ్వరరావు
  • ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగనివ్వం : మంత్రి తుమ్మల
  • ఏవైనా సమస్యలుంటే ఆఫీసర్లను కలవాలని సూచన
  • రైతులను ప్రతిపక్షాలు పక్కదోవ పట్టిస్తున్నాయని ఫైర్

హైదరాబాద్, వెలుగు : రుణమాఫీకి అర్హులైన ప్రతి ఒక్క రైతుకూ న్యాయం జరుగుతుందని, ఏ ఒక్కరికీ అన్యాయం చెయ్యబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పలు సాంకేతిక సమస్యల వల్లే కొందరికి డబ్బులు ఖాతాల్లో పడలేదని తెలిపారు. రైతులకు ఏవైనా సమస్యలుంటే.. రైతు వేదికల వద్ద అగ్రికల్చర్​ ఆఫీసర్లు ఉంటారని, వారి వద్ద పరిష్కరించుకోవచ్చని సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. శనివారం సెక్రటేరియెట్​లో మీడియాతో తుమ్మల మాట్లాడారు.

‘‘అధికారంలోకి వచ్చిన మొదట్లోనే రూ.31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయడం దేశ చరిత్రలో తొలిసారి. మా​ప్రభుత్వం చేసిన రుణమాఫీ చరిత్రలో నిలిచిపోతుంది” అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతివ్వాలి గానీ, బురదజల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ‘‘రైతుబంధుకు గత ప్రభుత్వం మూటగట్టి ఇవ్వలేదు.

మా ప్రభుత్వం వచ్చాకే చెల్లించాం. విధివిధానాలు ఖరారు చేసి రైతు భరోసానూ ఇస్తాం. గత ప్రభుత్వం చేసిన మోసాలను దృష్టిలో పెట్టుకుని, మా ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవద్దు. రైతులంతా నమ్మకంగా ఉండాలి. ప్రతి రైతుకూ రుణమాఫీ చేసి తీరుతాం. ఇంకా నాలుగున్నరేండ్లు అధికారంలోనే ఉంటాం. రుణమాఫీ కాకపోతే నిలదీయండి” అని అన్నారు.