వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి తుమ్మల

వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి తుమ్మల

భద్రాచలం, వెలుగు :  గోదావరికి ఎంత వరదొచ్చినా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాచలం పట్టణంలోకి చుక్కనీరు రానీయం అన్న సీఎం రేవంత్​రెడ్డి మాటను నిలబెట్టామని తెలిపారు. శనివారం ఆయన గోదావరి  వరద ప్రాంతాలు, కరకట్టలను పరిశీలించిన అనంతరం ఆర్డీవో ఆఫీసులో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. భద్రాచలం పట్టణానికి, ఇతర మండలాలకు వరద ముంపు వాటిల్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు. కూనవరం రోడ్డులో రూ.38కోట్ల వ్యయంతో కరకట్ట శరవేగంగా నిర్మించామని, రోడ్డు నుంచి నీరు లోనికి రాకుండా మట్టికట్టను నిర్మించామని చెప్పారు.

30 గ్రామాలకు లక్ష్మీపురం మీదుగా రోడ్డును పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ దగ్గర ఉండి అన్ని పనులు చూస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఐదు పంచాయతీలు ఆంధ్రాలోకి వెళ్లిపోయాయని, ఇరు రాష్ట్రాల సీఎంలు త్వరలో మళ్లీ కలిసి వాటిని తెలంగాణలో కలుపుతారని చెప్పారు. రైతులకు యూరియా, ఎరువులు, డీఏపీ, విత్తనాలు  సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గర్భిణుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని పీహెచ్​సీల్లో సిబ్బంది, మందులు ఉంచామన్నారు. పునరావాస కేంద్రాలే కాకుండా, అన్ని మండలాలకు నాలుగువేల క్వింటాళ్ల బఫర్​ స్టాక్​ పంపామని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్​ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్​, పీవో రాహుల్, ఏఎస్పీ అంకిత్, ఆర్డీవో దామోదర్​ ఉన్నారు.

సీతారామ, ఎన్ఎస్పీ లింక్ కెనాల్ పనులు  స్పీడప్ చేయండి


తల్లాడ : సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను త్వరగా పూర్తిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఏన్కూరు మండలం హిమాంనగర్ వద్ద పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు నెలలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆఫీసర్లకు చెప్పారు.