- కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు విధిగా పర్యవేక్షించాలి: మంత్రి తుమ్మల
- సీసీఐ నోటిఫై చేసినప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేయాలి
- ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశాలు
- పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తో కలిసి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: పత్తికొనుగోళ్లు వేగవంతం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులకు సమీపంలో సీసీఐ నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు రైతులకు ఇబ్బంది కలుగకుండా పూర్తిస్థాయి సిబ్బందితో పనిచేసేలా చూడాలన్నారు. మిల్లులో ఎంత టైమ్ పండుతుందో తెలుసుకునే విధంగా ప్రత్యేక యాప్ ను రూపొందించినట్టు చెప్పారు.
ఈ యాప్ ను పూర్తిస్థాయిలో రైతులు ఉపయోగించుకొని, పత్తిని మద్దతు ధరకు సీసీఐ సెంటర్లలోనే విక్రయించాలని సూచించారు. సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్ యార్డుకు లూస్ కాటన్ తెచ్చినా.. మార్కెట్ యార్డు నుంచి జిన్నింగ్ మిల్లులకు వెళ్లే రవాణా ఖర్చుతో పాటు మార్కెట్ లో లోడింగ్, అన్ లోడింగ్ ఖర్చు రైతుల మీదే పడుతుందన్నారు.
ఈ భారం రైతులకు ఉండకూడదనే సీసీఐ నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లును రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కలెక్టర్లు, మార్కెటింగ్ అధికారులు విధిగా పత్తికొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. వాట్సాప్ (8897281111) ద్వారా వచ్చే ప్రతి ఫిర్యాదును మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. మంగళవారం వరకు 188 ఫిర్యాదులు రాగా, 157 ఫిర్యాదులను పరిష్కరించినట్టు చెప్పారు.
రైతులు మద్దతు ధరకే పత్తి అమ్ముకోవాలి..
రైతులందరూ పత్తి పంటను సీసీఐ నిబంధనల ప్రకారం సెంటర్లకు తీసుకువచ్చి మద్దతు ధరకే అమ్ముకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా.. వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని రైతులకు మంత్రి సూచించారు. ఇప్పటి వరకు రూ.82.44 కోట్ల విలువైన 11,255 టన్నుల పత్తిని 5,251 మంది రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు.