యాసంగిలో రైతులకు పనిముట్లు, మెషీన్లు : మంత్రి తుమ్మల

  • సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: యాసంగిలో రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం అగ్రికల్చర్​ సెక్రటరీ రఘునందన్​రావు, డైరెక్టర్ గోపీ, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేండ్లుగా వ్యవసాయ యాంత్రీకరణలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి నిధులు రాలేదని, దీంతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

 దీనికి తోడు రైతులకు యాంత్రీకరణపై అవగాహన కల్పించలేదన్నారు. ఇకపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎగ్జిబిషన్లను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారిగా ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి రైతులందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా స్థాయిలో స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. అగ్రికల్చర్ డిపార్ట్​మెంట్ తయారు చేసిన ప్రతిపాదనలను ఈ సందర్భంగా మంత్రి పరిశీలించారు. వ్యవసాయ యాంత్రీకరణ నిరంతర కార్యక్రమమని తెలిపారు. 

పటిష్టమైన నిబంధనలు రూపొందించి, రైతులకు యంత్రాలను, పనిముట్లను అందజేయాలన్నారు. జిల్లా స్థాయి ఎగ్జిబిషన్​లను వెంటనే ఏర్పాటు చేయాలని, వ్యవసాయ, అనుబంధ రంగాల వారందరినీ ఈ ఎగ్జిబిషన్ లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. కాగా, వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రోటవేటర్స్, ఎంబీ నాగళ్ళు, కల్టీవేటర్స్, తైవాన్ స్ట్రేయర్లు, బేలర్స్, పవర్ వీడర్స్, మొక్కజొన్న వొలుచే యంత్రాలు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లు అందించాలని ప్రతిపాదించినట్టు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు. జిల్లాల వారీగా ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితాను సిద్ధం చేశామన్నారు.