పామాయిల్ గెలలు.. టన్నుకు రూ. 20,871 : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పామాయిల్ గెలలు.. టన్నుకు రూ. 20,871 : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • ఏడాదిలో రూ.7 వేలకు పైగా ధర పెరిగింది

హైదరాబాద్, వెలుగు: పామాయిల్ గెలల ధర టన్నుకు రూ.20,871కి పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిరుడు ఫిబ్రవరిలో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.13,135- ఉండగా ఇప్పుడు రూ. 7 వేలకుపైగా పెరిగిందన్నారు. ఆయిల్ పామ్ గెలల ధర పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.  ఆయిల్ పామ్ సాగును లాభ సాటిగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ మిల్లుల్లో నూనె రికవరీ శాతం, ముడి పామాయిల్ అమ్మకం ధరల ఆధారంగా ప్రతి నెలా ఆయిల్ పామ్ గెలల ధరలను నిర్ణయిస్తారని చెప్పారు. ఆయిల్ ఫెడ్ ద్వారా నడుస్తున్న అప్పరావుపేట,అశ్వరావుపేటలోని ఆయిల్ పామ్ ఇండస్ట్రీల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

దీనివల్ల ఆయిల్ పామ్ గెలల నుంచి వచ్చే నూనె రికవరీ శాతం(ఓఈఆర్) టన్నుకు 19.02 శాతం నుంచి 19.42 శాతానికి పెరిగిందని, దాంతో గెలల ధర కూడా పెరిగిందన్నారు. తెలంగాణలో నిర్ణయించిన ధరలే ఏపీలోనూ ఇవ్వాల్సి రావడంతో అక్కడి రైతులకు కూడా లబ్ధి కలుగుతోందన్నారు. ఏపీలోని కొన్ని ఆయిల్ పామ్ కంపెనీలు బ్రోకర్లను ఏర్పాటు చేసి, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. ఆ కంపెనీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆయిల్ ఫెడ్ రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.39 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోందని మంత్రి తెలిపారు.